ఏడు చోట్ల వైసిపి కొత్త అభ్యర్ధులు

Apr 21,2024 02:20 #2024 elections, #YCP

ప్రజాశక్తి – అమరావతి : వైసిపిలో దాదాపుగా 7 నియోజకవర్గాల్లో అభ్యర్దులు కొత్తగా వెళ్లి పోటీ చేస్తున్నారు. మంత్రులతో సహా స్థానభ్రంశాలు తప్పలేదు. టిక్కెట్టు ఇచ్చినప్పుడే పార్టీ ఓట్లకు తోడు మీ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా తెచ్చుకుంటే గెలుపు నీదేనంటూ అధినేతలు స్పష్టంగా చెప్పారు. ఈ తరహా వ్యవహారాలు నడిచిన నియోజకవర్గాల్లో కులాల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. కొండపి రిజర్వుడు నియోజవర్గంలోనే అభ్యర్థులు ఇద్దరూ ఎస్పీలే అయినప్పటికీ సామాజికగ్రూపు వేర్వేరుగా ఉన్నారు. దీంతో ఇప్పటి వరకూ ఎస్సీలు తామున్న పార్టీల నుంచి తారుమారవుతున్నారు. అభ్యర్థులను బట్టి ఈ విభజన ఏర్పడింది. ఇక్కడ ఎస్సీల మధ్య వైరుధ్యం తీవ్రమవుతోంది.కనిగిరి, కందుకూరులో బీసీల ఎజెండా నడుస్తోంది. ఇక్కడా వైసిపి నుంచి నిలబడ్డ అభ్యర్థులు బీసీ ఎజెండాతోనే వారి సామాజికవర్గాలను పార్టీలకు అతీతంగా ఏకం చేయాలనే వ్యూహంతోనే ఉన్నారు. మార్కాపురంలోనూ ఇదే తరహా వ్యవహారం నడిచింది. గెలుపు కోసం ఇలాంటి పద్ధతులనే ఇప్పుడు ఎక్కువగా అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనం ఎజెండా ఎక్కడా కనిపించడం లేదు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇంత వరకూ ప్యాకేజీలు ఇవ్వలేదు. ప్రాజెక్టును మాత్రం సిఎం జగన్‌ ఇటీవలే ప్రారంభించారు. దీనిపై ఇప్పుడు నిర్వాసితులకు అభ్యర్థుల నుంచి ఎలాంటి భరోసా కనిపించడం లేదు. ప్యాకేజీలు ఇప్పిస్తామనే మాటే లేదు. దొనకొండలో పారిశ్రామిక వాడను ప్రకటించారు. పదేళ్లలో అతీగతీ లేదు. రెండు పార్టీలూ దీన్ని వదిలేశాయి. ఉపాధి, పరిశ్రమలపై పెద్ద ఎత్తున సాగిన ప్రచారం ఇపుడు వినిపించడం లేదు. కనిగిరి వద్ద సెజ్‌ను ప్రకటించారు. దీని పరిస్థితీ అంతే. కాగితాలకే పరిమితమైంది. సిఎస్‌పురం వద్ద సోలార్‌ విద్యుత్‌ కేంద్రం పెడతామన్నారు. ఇదీ మాటలకే పరిమితమైంది.

➡️