మీ ఓటు ఐదేళ్ల భవిష్యత్తు

  • బాబు అభివృద్ధి బోగస్‌… ఆయన వస్తే వ్యవస్థలు, సంక్షేమం రద్దు
  • పవన్‌ పెళ్లిళ్లపై మరోసారి విమర్శలు
  • చంద్రబాబు మోసాలు, పేదల మధ్య సాగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలు
  • భీమవరం ‘మేమంతా సిద్ధం’ సభలో సిఎం జగన్‌

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : ప్రస్తుత ఎన్నికలు ఎంపి, ఎమ్మెల్యేల ఎన్నికలే కాదని, మీ తలరాతను మారుస్తూ ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జగన్‌ బస్సు యాత్ర మంగళవారం కొనసాగింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం నుంచి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వరకు దాదాపు 37 కిలో మీటర్లు బస్సు యాత్ర కొనసాగింది. అనంతరం భీమవరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పేదల రాజ్యాన్ని ధ్వంసం చేసేందుకు మోసాలు, కుట్రలతో చంద్రబాబు కూటమి ఎన్నికల్లోకి దిగిందని, అడ్డుకునేందుకు మీరు సిద్ధమా అంటూ జనాలను ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సచివాలయ వ్యవస్థ, విలేజ్‌ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలు వంటి వ్యవస్థలతోపాటు అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్‌, రైతులకు అందించే రైతు భరోసా, అక్కాచెల్లెమ్మల అభున్నతి కోసం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు నిలిచిపోతాయన్నారు. 58 నెలల పాలనలో రూ.2.75 లక్షల కోట్లు వివిధ పథకాలు, స్కీమ్‌ల పేరుతో అందుకున్న కుటుంబాలన్నీ ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఇద్దరు వ్యక్తులు, రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలు కాదని, పేదల ప్రయోజనాలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధమని అన్నారు. జగన్‌ ఒక్కడే అని, బాబు పది మంది సేనలతో వస్తున్నారని తెలిపారు. వారు ఎక్కుపెట్టే బాణాలు తగిలేది జగన్‌కు కాదని, పేదలకిచ్చే పథకాలపైనని ఆలోచన చేయాలన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదంటూ చదివి వినిపించారు. 58 నెలల పాలనలో 17 మెడికల్‌ కాలేజీలు, 4 సి పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ ల్యాండ్స్‌, 26 జిల్లాల ఏర్పాటు, నాడు-నేడు వంటి అనేక పనులు జరిగాయని, జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనం ఐదవ స్థానంలో ఉందని వివరించారు. బాబు అభివృద్ధి అంతా బోగస్‌ గ్రాఫిక్స్‌ అని ఎద్దేవా చేశారు. 2014లో ఇదే కూటమి పోటీ చేసి ప్రత్యేక హోదా ఇచ్చిందా, తెచ్చిందా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే అబద్ధాలు, కుట్రలు గుర్తుకొస్తాయన్నారు. దత్తపుత్రుడు ముందు నాలుగైదేళ్లకు ఒకసారి కార్లు మార్చినట్లు భార్యలు మారుస్తారని, ఇప్పుడే అదే రీతిలో నియోజకవర్గాలు మార్చేస్తున్నారని, అడిగితే ఆయనకు బిపి పెరుగుతుందని విమర్శించారు. వాళ్ల తప్పులను ప్రశ్నిస్తే చంద్రబాబుకు, దత్తపుత్రుడికి, చంద్రబాబు వదినకు, ఆయన బాజాభజంత్రీలు పూనకం వచ్చినట్లు రెచ్చిపోతారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎంపి, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను పరిచయం చేసి అందరికి ఓటు వేయాలంటూ జనాలను జగన్‌ అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి రంగనాథరాజు, నేతలు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రోడ్‌షోగా పిప్పర, దువ్వ మీదుగా తేతలి చేరుకుని రాత్రి బస చేశారు. బుధవారం శ్రీరావ నవమి కావడంతో బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. గురువారం ఉదయం యాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. అయితే, షెడ్యూల్‌ ప్రకారం జగన్‌ తణుకు, పెరవలి మీదుగా తూర్పుగోదావరి జిల్లా ఈతకోట చేరుకుని రాత్రి బస చేయాల్సి ఉంది. తణుకు నియోజకవర్గంలో కొందరు ముఖ్య నేతలు వైసిపిని వీడి టిడిపిలో చేరేందుకు సిద్ధమయ్యారనే సమాచారంతో వారిని బుజ్జగించేందుకు జగన్‌ తణుకు శివారులోని తేతలిలో బస చేసినట్లు ప్రచారం సాగింది.

➡️