‘A I’ ఎఫెక్ట్‌ – వచ్చే ఐదేళ్లలో 30 కోట్ల ఉద్యోగాలు హాంఫట్‌ ..!

ఎఐ : రోబోలొస్తేనే వామ్మో ఏంటీ… మనుషులు చేసే పనులన్నీ రోబోలే చేసేస్తున్నాయి… ఫ్యూచర్‌ ఏంటి.. ఉద్యోగాల గతేంగానూ అనే భయం పోకముందే ‘ఎఐ’ వచ్చింది ఆ భయాన్ని మరింత పెంచింది. రోబోలతో రెస్టారెంట్లు, ఇండ్లలో రోబోలతో పనులు.. ఇలాంటివి ఎన్నో చూశాం.. విన్నాం..! ‘ఎఐ’ రోబోను మించి అచ్చు మనిషిలాగే అందమైన రూపంలో వినసొంపైన గొంతుతో ఏం ప్రోగ్రాం చేస్తే అలా చేసేసే టెక్నాలజీతో వస్తోంది. రోబోలు వచ్చి కొంతమంది ఉద్యోగాలను పీకేస్తే … ఇప్పుడు ఏకంగా ‘ఎఐ’ వస్తే ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయి నడిరోడ్డున పడతారో..! వచ్చే ఐదేళ్లలో 30 కోట్ల ఉద్యోగాల కోత తప్పదని అడికో సంస్థ సర్వే లో నిర్థారించింది..!

ఏఐ ఆధారిత ఆటోమేషన్‌ కారణంగా వచ్చే ఐదేళ్లల్లో కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు అడీకో సంస్థ తాజాగా అంచనా వేసింది. 9 దేశాల్లో 18 రంగాల్లో ఉన్న ప్రముఖ సంస్థల టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాల ఆధారంగా ఓ నివేదికను కూడా విడుదల చేసింది. ఎఐ కారణంగా ఉద్యోగుల తొలగింపులు తప్పబోవని.. 41 శాతం కంపెనీలు అభిప్రాయపడినట్లు స్పష్టమయ్యింది. ప్రముఖ సంస్థలే ఈ స్టేట్‌ మెంట్‌ ఇచ్చాయట..!

సంస్థలకు భారంగా ఉద్యోగులు : నిపుణులు
నిజానికి దగ్గరగా ఉండే వీడియోలు, ఇమేజీలు, టెక్ట్స్‌లు సృష్టించడంలో జెనరేటివ్‌ ఎఐ ఆధారిత టెక్నాలజీలు పరుగులెడుతున్నాయి. ఈ అసాధారణ టెక్నాలజీతో రోజూవారి ఎంతో కష్టతరమైన పనులను ఈ ఎఐ లు ఇట్టే చేసేస్తాయి..! పనులు సులభం.. తక్కువ ఖర్చు.. అనే అంచనాలున్నాయి. ఇంకేముంది… ప్రస్తుతమున్న అనేకమంది ఉద్యోగులు సంస్థలకు నిరుపయోగంగా, భారంగా మారతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

A I News Reader
A I News Reader

కొత్త ఉద్యోగాలు వస్తాయి : అడికో సీఈఓ డేనియల్‌ మాచుయెల్‌
అడికో సీఈఓ డేనియల్‌ మాచుయెల్‌ మాట్లాడుతూ … ఎఐ ప్రభావం అన్ని జాబ్స్‌పైనా ఉంటుందన్నారు. కొన్ని ఉద్యోగాలు కనుమరుగవుతాయని తెలిపారు. కొత్త ఉద్యోగాలు వస్తాయని అన్నారు. పదేళ్ల క్రితం డిజిటల్‌ టెక్నాలజీ గురించి ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయని, అనేక మంది ఉద్యోగాలు కొల్పోతారన్న ఆందోళన వ్యక్తమైంది… కానీ డిజిటల్‌ విప్లవంతో మరెన్నో జాబ్స్‌ వచ్చాయని చెప్పారు. ఎఐ విషయంలో కూడా కనుమరుగయ్యే ఉద్యోగాలు, కొత్త వాటి మధ్య సమతౌల్యం ఉంటుంది అని అన్నారు.

ఎఐ చాట్‌బాట్స్‌పై గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలు ఇప్పటికే దృష్టి పెట్టాయి. ఇక ఉద్యోగాల కోతలు తప్పేలా లేవని నిపుణులు అంటున్నారు. ఎఐ వినియోగం పెరిగాక ఉద్యోగాల్లో కోతలు తప్పట్లేదని అనేక సంస్థలు ఇప్పటికే అంగీకరించాయి. ఎఐ వినియోగం పెరిగే కొద్దీ ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల ఉద్యోగాలు కనుమరుగుకావచ్చని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ గోల్డ్‌మన్‌ సాక్స్‌కు చెందిన నిపుణులు గతంలో అంచనా వేశారు. అయితే, వచ్చే ఐదేళ్లల్లోనే ఈ పరిస్థితి దాపురించొచ్చని అడికో సర్వే అంచనా వేస్తోంది. ఇప్పటికే దేశంలో నిరుద్యోగాలు పెరిగి యువత దిక్కులేని స్థితిలో ఉన్నారు. మరి ఈ ఎఐ లొస్తే మిగతా ఉద్యోగాల పరిస్థితేంగానో..!

➡️