కుటుంబాల పొదుపులో కుదుపు

May 8,2024 21:07 #Business

మూడేళ్లలో రూ.9 లక్షల కోట్లు పతనం
2022ా23లో ఐదేళ్ల కనిష్టానికి పతనం
పెరిగిన అప్పుల భారం
న్యూఢిల్లీ : దేశంలో అధిక ధరలతో కుటుంబాల పొదుపు కుంటుపడింది. పైగా అప్పుల భారం పెరిగింది. కేవలం మూడేళ్లలోనే ప్రజల నికర పొదుపులో ఏకంగా రూ.9 లక్షల కోట్లు పతనమయ్యింది. 2020ా21లో దేశంలోని కుటుంబాల పొదుపు రూ.23.29 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ఇది 2021-22లో రూ.17.12 లక్షల కోట్లకు పరిమితమయ్యింది. 2022ా23లో ఏకంగా రూ.14.16 లక్షల కోట్లకు క్షీణించింది. దీంతో గడిచిన మూడేళ్లలో పొదుపు పెరగక పోగా.. ఏకంగా నికరంగా రూ.9లక్షల కోట్లు పతనమయ్యింది. ఐదేళ్ల కనిష్టానికి పొదుపు సామర్థ్యం పడిపోయినట్లు కేంద్ర గణంకాల మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన జాతీయ పద్దు గణాంకాలు-2024 వివరాలు స్పష్టం చేస్తున్నాయి.
రుణ భారం రెట్టింపు..
2020-21తో పోల్చితే 2022-23లో కుటుంబాల రుణ భారం కూడా రెట్టింపు అయ్యింది. 2020-21లో రూ.6.05 లక్షల కోట్లుగా ఉండగా.. 2021-22లో రూ.7.69 లక్షల కోట్లకు, 2022-23లో రూ.11.88 లక్షల కోట్లకు ఎగిసింది. ఆర్థిక సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ద్వారా తీసుకున్న రుణాలు కూడా పెరిగాయి. ఈ అప్పులు 2020-21లో రూ.93,723 కోట్లుగా ఉండగా.. 2021-22లో మాత్రం రూ.1.92 లక్షల కోట్లుగా.. 2022-23లో ఏకంగా రూ.3.33 లక్షల కోట్లను చేరాయి. ఎంఎఫ్‌ల్లో మాత్రం కొంత పొదుపు పెరిగింది. 2022-23లో మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో కుటుంబాల పెట్టుబడులు రూ.1.79 లక్షల కోట్లుగా, 2021-22లో రూ.1.6 లక్షల కోట్లుగా, 2020-21లో రూ.64,084 కోట్లుగా ఉన్నాయి. అలాగే షేర్లలో, డిబెంచర్లలో పెట్టుబడులు 2022-23లో రూ.2.06 లక్షల కోట్లుగా, 2020-21లో రూ.1.07 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. స్థూలంగా 2020-21 నుంచి దేశంలోని కుటుంబాల పొదుపు తగ్గి, రుణ భారం పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ ఏడు, ఎనిమిది శాతంతో పరుగులు పెడుతోందని మోడీ సర్కార్‌ చేస్తున్న ప్రచారానికి.. వాస్తవ కుటుంబాల పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. దేశంలో సాధారణ కుటుంబాల ఆదాయాలు, పొదుపు పడిపోవడం, అప్పులు పెరగ్గా.. మరోవైపు కార్పొరేట్ల ఆదాయాలు దండిగా పెరిగాయి. మోడీ సర్కార్‌ హయంలో అధిక ధరలు ప్రజల పొదుపు సామర్థ్యాలను దెబ్బతీస్తున్నాయి. వ్యయాలు పెరగడంతో కుటుంబాలు ఆర్థికంగా బక్కచిక్కుతున్నాయని స్పష్టమవుతోంది.

➡️