ఇవి బ్యాటరీ ధరలు భారం

May 13,2024 22:45 #Business

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎండి వెల్లడి
న్యూఢిల్లీ : విద్యుత్‌ వాహనాల బ్యాటరీల ధరలు అధికంగా ఉన్నాయని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ లాల్‌ అన్నారు. విద్యుత్‌ మోటార్‌ సైకిల్‌ తయారీకి పెద్ద బ్యాటరీలు అవసరమవుతాయన్నారు. ప్రస్తుతం బ్యాటరీల పరిమాణం పరంగా పెద్దగా ఉన్నాయన్నారు. బరువు కూడా ఎక్కువగానే ఉన్నాయన్నారు. దీనివల్ల పెట్రోల్‌ ద్విచక్ర వాహనాలతో పోలిస్తే ఇవిల వ్యయం బాగా పెరుగుతుందని లాల్‌ ఓ ఇంటర్యూలో పేర్కొన్నారు. 2025 నాటికి తమ తొలి విద్యుత్‌ మోటార్‌ సైకిల్‌ను తీసుకొస్తామని ఇది వరకే ప్రకటించిన్పటికీ.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ మరింత ఆలస్యం కానుందన్నారు. ఇవి మోటార్‌ సైకిల్‌ తీసుకొచ్చే ఆలోచన ఉన్నప్పటికీ తాము తొందరపడడం లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ ఇవిలకు డిమాండ్‌ పెద్దగా లేదన్నారు. బ్యాటరీల బరువు తగ్గి, వాటి ధరలు అందుబాటులోకి వచ్చే వరకు ఆశించిన స్థాయిలో డిమాండ్‌ ఉండకపోవచ్చన్నారు. అయినప్పటికీ తాము సొంతంగా ఓ ఇవి మోటార్‌ సైకిల్‌ను అభివృద్థి చేస్తున్నామని వెల్లడించారు. అదే విధంగా స్పెయిన్‌కు చెందిన స్టార్క్‌ మోటార్‌ సైకిల్‌తో మరో ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నామన్నారు.

➡️