అంగన్వాడీల సమ్మెకు అండగా ఉంటాం

 ప్రజాశక్తి – సాలూరు  :  తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు డిసెంబర్‌ 8నుంచి చేపట్టనున్న సమ్మెకు అండగా ఉంటామని పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు మద్దతు పలికారు. శుక్రవారం అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు నాయకులు బి.రాధ అధ్యక్షతన జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఉమామహేశ్వరి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల ముందు సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను విస్మరించారని చెప్పారు. తెలంగాణా కంటే ఎక్కువ జీతం ఇస్తామని చెప్పి మాట తప్పారని అన్నారు. గడచిన నాలుగేళ్లలో వారి జీతం వెయ్యి రూపాయలు ప్రభుత్వం పెంచింది కానీ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా పెంచలేదని చెప్పారు. అంగన్వాడీలకు ఉన్న హక్కులను కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాసే ప్రయత్నంలో ఉన్నాయని విమర్శించారు. అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకులు పంపిణీ చేయడం లేదన్నారు. గతంలో సరుకులను కేంద్రాలకు ప్రభుత్వమే సరఫరా చేసేదని, కానీ ఇప్పుడు కార్యకర్తలకే సరుకులు రవాణా బాధ్యతలు అప్పగించారని చెప్పారు. గతంలో మినీ అంగన్వాడీ కేంద్రాలు 400 జనాభాకు ఒకటి చొప్పున వుండేదని చెప్పారు. ఇప్పుడు వెయ్యి జనాభా దాటినా మినీ అంగన్వాడీ కేంద్రాలు గానే వాటిని ఉంచారని చెప్పారు. దీనివల్ల మినీ అంగన్వాడీ కార్యకర్తలపై విపరీతమైన పనిభారం పడుతున్నదని చెప్పారు. హెల్పర్‌ ఇచ్చే వేతనంతో అంగన్వాడీ కార్యకర్త, హెల్పర్‌ ఉద్యోగాలను చేయాల్సి వస్తోందని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కింద రూ.ఐదు లక్షలు చెల్లించాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు సంబంధించిన వయోపరిమితిని 50ఏళ్లకు పెంచాలని కోరారు. రాజకీయ జోక్యం నివారించాలని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సర్వీసులో ఉండి చనిపోయిన వారి కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరించడానికి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి కనీసం చర్చలకు అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. ఆందోళలపై అణిచివేత ధోరణి అవలంభిస్తుండడం అన్యాయమని అన్నారు. డిసెంబరు 8 నుంచి చేపట్టనున్న సమ్మెకు ముందుగా దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమాలకు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని ఉమామహేశ్వరి కోరారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు సిగడాపు బంగారయ్య, సిపిఐ నాయకులు సిద్దాబత్తుల రామచంద్రరావు, జనసేన నాయకులు శివకృష్ణ, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు, పాచిపెంట సిఐటియు నాయకులు కె.ఈశ్వరరావు మాట్లాడారు. సిపిఎం మండల కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, గిరిజన సంఘం నాయకులు గాసి, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ పాచిపెంట ప్రాజెక్టు అధ్యక్షులు టి.ప్రభావతి, కార్యదర్శి దాలమ్మ, మండల యూనియన్‌ నాయకులు శశికళ, ఎ.నారాయణమ్మ, పట్టణ యూనియన్‌ కార్యదర్శి వరలక్ష్మి, శ్రామిక మహిళా కన్వీనర్‌ టి.ఇందు, పట్టణ ఐద్వా నాయకులు బంగారు సునీత పాల్గొన్నారు.

➡️