అంగన్వాడీల సమ్మెకు సంపూర్ణ మద్దతు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :   అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సమస్యలు పరిష్కారానికి, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు కోసం వచ్చేనెల 8న చేపట్టనున్న సమ్మెకు సంపూర్ణ సహకారం అందిస్తామని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నాయకులు తెలిపారు. శుక్రవారం అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కెఎల్‌ పురం ప్రజాసంఘాల కార్యాలయంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు అధ్యక్షతన జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగాలను, సేవా రంగాలని పూర్తిగా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాయని అన్నారు. పిల్లలకు పోషణ అందిస్తున్న అంగన్వాడీలకు పౌష్టికాహారం లేకుండా చేస్తున్నాయని, కనీస వేతనాలు అమలు చేయటం లేదని అన్నారు. అంగన్వాడీ వ్యవస్థను నాశనం చేయడానికి నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఐసిడిఎస్‌ రక్షణకు ప్రజా పోరాటాలు పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జనసేన నాయకులు రామచంద్ర రాజు మాట్లాడుతూ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌లు, ఇతర సదుపాయాలు కల్పించకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని పేర్కొన్నారు. తెలుగుదేశం నాయకులు బెవర భరత్‌ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం సమస్యలపై పోరాడుతున్న ప్రజలపై అణచివేతకు పాల్పడుతోందని అన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు కోటేశ్వరరావు మాట్లాడుతూ డిమాండ్ల సాధనకు పోరాడుతున్న అంగన్‌వాడీలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. లోక్‌సత్తా నాయకులు రాజారావు మాట్లాడుతూ కష్టానికి తగ్గ వేతనాలు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం దుర్మార్గమని తెలిపారు. ఐఎన్‌టియుసి నాయకులు శంకర్రావు మాట్లాడుతూ న్యాయమైన ఈ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని అన్నారు . ఐఎఫ్‌టియు జిల్లా ఉపాధ్యక్షులు కె.అప్పలసూరి మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీలు వమ్ము చేయడం తగదని అన్నారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ జగన్‌ దిగిచ్చే వరకు పోరాటం కొనసాగించాలని అంగన్వాడీలకు పిలుపునిచ్చారు. ఆశా వర్కర్ల యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సుధారాణి మాట్లాడుతూ బడ్జెట్‌ పెంచడం, సౌకర్యాలు కల్పించడం, సంస్థాగతం చేయడం వంటివి చేయకుండా ఐసిడిఎస్‌ను ఎత్తివేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవడం దుర్మార్గమని అన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి పి రమణమ్మ మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలకు సేవ చేస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూడడం సరైనది కాదని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి. రామ్మోహన్‌ మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో భాగంగా పిల్లలకు పౌష్టికాహారం, చదువు లేకుండా చేయడానికి చేస్తున్న కుట్రను పోరాటాలతో తిప్పి కొట్టాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కూలీలు. రైతులు, కార్మికులు బిడ్డలకు సేవ చేస్తున్న అంగన్‌వాడీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.అనసూయ మాట్లాడుతూ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. మహిళా సాధికార తంటే స్కీం వర్కర్లను మోసం చేయడం కాదని తెలిపారు. జిల్లా గౌరవాధ్యక్షులు వి.లక్ష్మీ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చొరవ చేయాలని, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని అందరూ బలపరిచి సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాటాలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కె. ప్రభావతి, కుమారి, శివ, సుశీల తదితరులు పాల్గొన్నారు.

➡️