ఆర్‌టిసి డ్రైవర్‌ మృతి కేసులో న్యాయం కావాలి

దళిత ఆర్‌టిసి డైవర్‌

ప్రజాశక్తి -గోపాలపట్నం : దళిత ఆర్‌టిసి డైవర్‌, చింతా నాగేశ్వరరావు మృతి కేసులో న్యాయం కావాలని పలు దళిత, ప్రజా, కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. గురువారం సింహాచలం రోడ్‌ లోని ఆర్‌టిసి సింహాచలం డిపో వద సింహాచలం 5వ వర్ధంతిసభను ఏపీఎస్‌ఆర్టీసీ (ఏపీపీటీడీ) ఎస్‌సి, ఎస్‌టి ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా నాగేశ్వరరావు చిత్రపటానికి కుటుంబ సభ్యులు, సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సభకు అధ్యక్షత వహించిన దళిత హక్కుల సమాఖ్య అధ్యక్షుడు కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడుతూ,చింతా నాగేశ్వరరావు బలవన్మరణం ఘటన జరిగి ఐదేళ్లయినా నేటికీ న్యాయం జరగకపోవడం దారుణమన్నారు.డ్రైవర్‌ మృతికి కారణమైన నాటి డిపో మేనేజర్‌ దివ్యపై ఇప్పుడు వరకు యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. దళిత విముక్తి రాష్ట్ర కన్వీనర్‌ సుర్ల వెంకటరమణ మాట్లాడుతూ తన చావుకు డిపో మేనేజర్‌ కారణమని స్వదస్తూరితో రాసినా చర్యలు లేకపోవడం దారుణమన్నారు. విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ డాక్టర్‌ బూసి వెంకట్రావు మాట్లాడుతూ ఘటనపై ఐపిసి 306, ఎస్‌సి,ఎస్‌టి అత్యాచార చట్టం కింద కేసులు నమోదు చేసినా తదుపరి చర్యల్లేకపోవడం శోచనీయమన్నారు. ఆర్‌టిసి ఎస్‌సి, ఎస్‌టి ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ యన్‌ ధర్మారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎ .రావు మాట్లాడుతూ కార్మికులపై డిఎం దివ్య వేధింపులకు వ్యతిరేకంగా పోరాడి నాగేశ్వరరావు బలయ్యారన్నారు. కార్యక్రమంలో పిఒడబ్ల్యూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఎం. లక్ష్మి , చింతా నాగేశ్వరరావు భార్య అమ్మాజీ, సింహాచలం డిపో గౌరవ అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి బివై.రత్నం, అధ్యక్షుడు బిఎ. రావు,కార్యదర్శి ఎస్‌ గురవయ్య, రీజనల్‌ అధ్యక్షుడు భీమయ్య, పిఎస్‌. నారాయణ,. అసోసియేషన్‌ ఉపాధ్యక్షురాలు కె.సుజాత, పి సుష్మ, ఎం. వి.లక్ష్మి సిహెచ్‌ రావు, సిహెచ్‌ ఆనందరావు పాల్గొన్నారు. అనంతరం సభా స్థలం నుండి సింహాచలం ఆర్‌టిసి డిపో వరకు ర్యాలీ నిర్వహించి, డిపో గేటు వద్ద నిరసన చేపట్టారు.

నిరసన తెలియజేస్తున్న ఆర్‌టిసి కార్మికులు, కుటుంబసభ్యులు

➡️