జగన్‌ కుర్చీ మడతపెడతాం : లోకేష్‌

Feb 16,2024 20:34

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  వైసిపి నాయకులు చొక్కా మడతపెడితే…. టిడిపి, జనసేన కార్యకర్తలు కుర్చీలు మడతపెడతారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. సిఎం జగన్‌ ప్రవేశపెట్టిన ప్రతి స్కీమ్‌ వెనుకా ఒక స్కాం ఉందన్నారు. తన స్టార్‌ క్యాంపెయినర్స్‌ ప్రజలే అంటున్న జగన్మోహన్‌రెడ్డి చర్చకు సిద్దమా? అని ప్రశ్నించారు. నెల్లిమర్ల, విజయనగరం, గజపతినగరం నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగిన శంఖారావం సభల్లో ఆయన ప్రసంగించారు. రాజధాని ఫైల్స్‌ సినిమా గురించి తెలిశాక జగన్‌కు భయం పట్టుకుందని, అందుకే బయటకు రానీయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. యాత్ర-2 సినిమా వైకాపాకు అంతిమయాత్రలా మారిందని, రాజధాని ఫైల్స్‌ సినిమా ఆడుతున్న ధియేటర్ల వద్దకు పోలీసులను పంపారని అన్నారు. రాజధాని విషయంలో జగన్‌ రెడ్డి ఎన్నో యూ టర్న్‌లు తీసుకుని, అటు రైతులను, ఇటు ప్రజలను మోసం చేశారని, అందుకే ప్రస్తుతం ఆయనకు ఇటువంటి గత్యంతరం పట్టిందని అన్నారు. అమరావతి రాజధానికి మద్దతిస్తామని నమ్మించి, తాజాగా మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారన్నారు. ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే 4ఏళ్ల 10నెలల్లో ఒక్క పరిశ్రమ కూడా ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. రాజధాని నిర్మించడం చేతకాక వైవి సుబ్బారెడ్డి అవకాశం లేని హైదరాబాద్‌ మరో ఐదేళ్లు కావాలనడం సిగ్గుచేటన్నారు. ప్రజలే స్టార్‌ క్యాంపెయినర్స్‌ అని అంటున్న జగన్‌… సమయం, తేదీ చెబితే గృహిణులు, నిరుద్యోగ యువత, మద్యం ప్రియుల వద్ద చర్చకు తాము సిద్ధమేనన్నారు. నాశిరకం మద్యం, గంజాయితో యువతీ, యువకుల ఆరోగ్యం, ప్రాణాలతో జగన్‌రెడ్డి చలగాటమాడుతున్నారని, తాము అధికారంలోకి వస్తే గంజాయి లేకుండా చేస్తామని అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతనే ఓట్లు అడుగుతానన్న జగన్‌ మాట తప్పి మరో అవకాశం ఇవ్వమంటున్నాడని విమర్శించారు. జగన్‌ ప్రవేశపెట్టిన ప్రతి స్కీమ్‌ వెనుకా ఓ స్కాం దాగి ఉంటుందన్నారు. సెంటు స్థలాల పేరుతో రూ.7వేల కోట్లు, లెవలింగ్‌ పేరుతో రూ.2200కోట్లు దోచేశారు. ఎక్కడ భూమి, చెరువు కనిపించినా కబ్జా చేస్తున్నారని, ల్యాండ్‌, శాండ్‌, వైన్‌, మైన్‌ మాఫియాకు ఉత్తరాంధ్రను కేంద్రంగా మార్చారని అన్నారు. రెండు నెలలు ఆగితే వైసిపి దోచుకున్న సొమ్మును వడ్డీతో సహా కక్కిస్తామన్నారు. జగనన్న ఇళ్లు చేతితో తాకితేనే కూలిపోయే పరిస్థితి ఉందని, టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెరుగైన టెక్నాలజీతో ఇళ్లు కట్టిస్తామని అన్నారు. ‘చంద్రబాబు అంటే పోలవరం రేంజ్‌.. నీ రేంజ్‌ పిల్ల కాలువ రేంజ్‌. చంద్రబాబు అంటే కియా గుర్తుకు వస్తుంది.. జగన్‌ అంటే కోడికత్తి గుర్తుకువస్తుంది’. అంటూ సిఎం జగన్‌ను విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి జిల్లాలోనూ క్రమంగా కేన్సర్‌ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల కష్టాలు తీర్చేందుకే బాబు-పవన్‌ కలిసి సూపర్‌ -6 హామీలు ప్రకటించారని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సభల్లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు పి.అశోక్‌గజపతిరాజు, విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిమిడి నాగార్జున, ఆయా నియోజకవర్గ ఇన్‌ఛార్జులు కర్రోతు బంగార్రాజు, పి.అదితి గజపతి, కెఎ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️