నూతన వరి వంగడాలు సాగు చేయాలి : ఎడిఎ

Mar 28,2024 21:39

ప్రజాశక్తి – పాచిపెంట: రైతులు పాత వంగడాల స్థానంలో కొత్త వరి వంగడాలను పరిశీలనాత్మకంగా రాబోయే ఖరీఫ్‌ సీజన్లో సాగు చేయాలని వ్యవసాయ శాఖ సహాయసంచాలకులు మధుసూదనరావు తెలిపారు. మండలంలోని పెద్దచీపురువలస, శ్యామల గౌరీపురం గ్రామాల్లో రైతులతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఒకే రకమైన రకాన్ని సాగు చేయడం వల్ల విత్తనం నాణ్యత తగ్గి పంట దిగుబడులు తగ్గిపోతుందన్నారు. కావున కాబట్టి రాబోయే ఖరీఫ్‌కు ఆర్‌జిఎల్‌ 25 37, ఎంటియు 70 26 బిపిటి 32 91 రకాలను విడనాడి వాటి స్థానంలో ఎంటియు 13 18, ఎన్‌ టి యు 1271 వంటి రకాలను సాగు చేసుకోవాలని సూచించారు. భూసారం నానాటికీ క్షీణిస్తుందని, భూమిని ఇప్పటి నుంచే బాగు చేసుకోవాలని, భూమిలో సేంద్రియ కర్బన్‌ పెరగాలంటే తప్పనిసరిగా పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకుని పూతదశలో కలియ దున్నుకోవాలని తెలిపారు. రైతులు ఎక్కువగా రసాయన ఎరువులపై ఆధారపడకుండా సేంద్రియ ఎరువులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సేంద్రియ, రసాయన ఎరువులను సమతూకంలో వినియోగించుకోవాలన్నారు. అప్పుడే నేల ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యవంతమైన పంట పండుతుందని తెలిపారు. మండల వ్యవసాయాధికారి కె.తిరుపతిరావు మాట్లాడుతూ మారుతున్న నూతన సాంకేతికతతో తయారు చేసిన నానో యూరియా, డిఎపి వాడుకుంటే శ్రమ తగ్గడమే కాకుండా ఖర్చు కలిసి వస్తుందని తెలిపారు. నానో ఎరువులను పురుగుల మందులతో కలిపి పిచికారి చేసుకోవడం వల్ల పురుగుల మందుల పనితనం పెరుగుతుందన్నారు. కావున రైతులు రాబోయే ఖరీఫ్‌కు నానో ఎరువులపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో విఎఎ వినోద్‌కుమార్‌, నాగమణి, రైతులు పాల్గొన్నారు

➡️