పదో తరగతి పరీక్షలపై అవగాహన కల్పించాలి

ప్రజాశక్తి -గాజువాక : పదవ తరగతి పరీక్షల పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటుచేయాలని గాజువాక ఇండిస్టియల్‌ ప్రయివేటు స్కూల్స్‌ అసోసియేషన్‌ (జిప్సా) అధ్యక్షులు పాలవలస భాస్కరరావు తెలిపారు. హరనాథ విద్యానికేతన్‌ పాఠశాలలో ఆదివారం జిప్సా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. వచ్చే మార్చి నెలలో జరిగే పబ్లిక్‌ పరీక్షలలో జిప్సా పరిధి పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి అవగాహన సదస్సు నిర్వహించాలన్నారు. ఈ నెల 9వ తేదీన బిసి రోడ్డులోని టిఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులచే సదస్సు నిర్వహించి, విద్యార్థులకు పరీక్షలపై భయం పారద్రోలి, చదువుపట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదవకాశాన్ని జిప్సా సభ్యులందరూ వినియోగించుకొని 10వ తరగతి విద్యార్థులందరినీ ఆరోజు ఉదయం 9 గంటలకు హాజరుపరచాలని కోరారు. ఈ సమావేశంలో జిప్సా కార్యదర్శి బి.శ్రీనివాస్‌, కోశాధికారి డి.శ్రీనివాసరావు, సలహాదారు ఎం.జగ్గారావు, సభ్యులు మురళి, బాబూరావు, కుమార్‌, మౌళి, నాయుడు, వాసుదేవరావు, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️