ఆమె లేని ఒక రోజు!

Jun 30,2024 07:33 #katha, #Sneha

నీటికి నానిపోయిన న్యూస్‌పేపర్‌ను గాలికి ఆరబెడుతోంది సీత. గుమ్మం తడిగా వుందని బహుశా చూడలేదేమో పేపరువాడు. నేను కళ్ళు తెరవగానే నాకు కనపడ్డ సీన్‌ అది. పట్నంలో పల్లెటూరిలా, బర్గర్ల మధ్య ఆవకాయలా సమయంతో సంబంధమే లేకుండా ఎప్పుడూ భలే తాజాగా వుంటుంది ఆమె. ఇన్ని పనుల మధ్య కూడా అంత ప్రశాంతత ఆమెకెలా సాధ్యమో మరి. మా అమ్మ కూడా ఇలాగే వుంటుంది చాలా కూల్‌గా. వీళ్ళు ఎలా వుండగలరో ఇలా.
వంటగదిలో కుక్కర్‌ కుయ్యి అని విజిల్‌ వేసింది. నా ఆలోచనలు చెదిరిపోయాయి. ఆ కుక్కర్‌ ప్రెజర్‌తో పాటు వచ్చిన పొంగలి వాసన నా గదిలోకి అనుమతి లేకుండానే చొరబడింది. ఆ వాసన మహిమో ఏమో.. నేను మంచం పైనుంచీ లేచి కుర్చున్నాను. తొంగి చూసాను హాల్లోకి. సీత పాల గిన్నెతో వంటగదిలోకి వెళ్తోంది. ఫోన్‌ ఆన్‌చేసి చూసాను. సమయం ఎనిమిది కావస్తోంది. ఆఫీస్‌ తొమ్మిదికి. స్నానంచేసి వెళ్ళటమేగా మరికాసేపు పడుకుందామా అనుకున్నాను. కానీ పొంగలి నన్ను అలా చెయ్యనివ్వలేదు. బద్దకంగా ఒళ్ళు విరుచుకుని హాల్లోకి వచ్చాను. గదంతా అగరబత్తుల వాసన. భలే గమ్మత్తుగా అనిపించింది. నెమ్మదిగా బాత్‌రూమ్‌వైపు నడిచాను. తయారై డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వచ్చేసరికి పొంగలి పొగలు కక్కుతూ సిద్ధంగా వుంది. పక్కనే నా కారేజ్‌ కూడా పాక్‌ చేసి వుంది.
టిఫిన్‌ ముగించుకుని టైం చూసాను ఇంకా అరగంట మిగిలే వుంది. ఫ్యాన్‌ కింద గాలికి ఎగురుతున్న పేపర్‌ నన్ను పిలుస్తున్నట్టు అనిపించింది. ఇక ఓ పది నిమిషాలు ఆ కాగితాల సందుల్లోకి దూరిపోయాను. ఆ తరువాత వున్న ఆ ఇరవై నిమిషాలూ ఆఫీస్‌కు చెయ్యాల్సిన ప్రయాణానికి చాలని లెక్కవేసుకొని శ్రీమతికి వెళ్ళొస్తానని చెప్పి బైక్‌ స్టార్ట్‌ చేసాను. కానీ అదేమిటో విచిత్రంగా బైక్‌ హారన్‌ కాస్తా సైకిల్‌ బెల్‌లా వినిపించింది. ఎన్నిసార్లు కొట్టినా అదే వరస. నేను అయోమయంగా నా భార్య వైపు చూసాను. ఇది మరీ విచిత్రం.. ఆమె వున్నపళానా మాయం అయ్యింది.
నాకు తల తిరిగినంత పనైంది. ఏం జరుగుతోందో అర్ధం కాలేదు. ఎవరో నా కళ్ళు బలవంతంగా తెరుస్తున్నట్టు అనిపించింది. కళ్ళు తెరిచి చుట్టూ చూసాను. అంతా గందరగోళంగా వుంది. ఎక్కడ వున్నానో నిమిషం అర్ధం కాలేదు. అంతా తెలిసిన చోటులాగే వుంది. కిటికీ కర్టెన్‌ గాలికి ఎగురుతుంది. అదే అదునుగా సూర్యుడి వెలుగు గదిని ఆక్రమించుకుంటుంది. చుట్టూ మళ్ళీ పరికించి చూసాను. నేను నా మంచం పైనే వున్నాను. అంటే నేను అప్పుడే నిద్ర నుండి లేచానన్నమాట. ఒక్కసారి ఇందాక జరిగిన సంఘటనలన్నీ బేక్వర్డ్‌ బటన్‌ నొక్కినట్టు వెనక్కి వెళ్లిపోయాయి. ఇంట్లో సీత జాడ ఎక్కడా కనపడలేదు. హాల్లో అగరబత్తుల వాసన లేదు. వంటగదిలో కుక్కర్‌ విజిల్‌ చప్పుడూ లేదు. ఇల్లంతా నిశబ్దం. అప్పుడు గుర్తొచ్చింది సీత వూరు వెళ్ళిన సంగతి. అది గుర్తు రాగానే ధడేలున లేచాను. ఫోన్లో టైం చూస్తే ఎనిమిది అయ్యింది. ఇల్లంతా శుభ్రం చేసుకొని ఎప్పుడు వెళ్ళేది నేను ఆఫీస్‌కి. ఆ విషయం గుర్తురాగానే ఠక్కున నిల్చున్నాను. అప్పుడు వినబడింది.. బైట పాలవాడి సైకిల్‌ బెల్‌.
వాడు అరిచినంత పనిచేసాడు.. నేను వంటగది అల్మరాలోకి తల దూర్చి ఆ పాలగిన్నె వెతికి పట్టుకునేసరికి ఆ పాలన్నీ నా తల పైన ఒలకబోస్తాడేమో అన్నంత భయం వేసింది వాడి అరుపుకి. గుమ్మంలో న్యూస్‌ పేపర్‌ పడి వుంది. దాన్ని తీసి సోఫాలోకి గిరాటేసాను. అది పొడిగానే వుంది. సీత లేదుగా గుమ్మం కడిగేందుకు.
‘ఏటి సార్‌ సీతమ్మగోరు లేరేటి?’ అని అడిగాడు పాలవాడు.
‘లేరు. వారం రోజులకు కానీ రారు. ఊరెళ్ళారు’ అన్నాను.
‘ఆహా! అయితే రోజూ మీరిట్టా లేట్‌ సేత్తారా.. అలాగయితే నాకు బలే కట్టమైపోద్ది సార్‌’ అన్నాడు వాడు.
‘అబ్బే లేదు లేదు. ఈ రోజు ఇలా అయ్యిందని రోజూ ఇలానే అవుతుందా? రేపటి నుంచి వేగంగానే వస్తాలే’ అని చెప్పాను. వాడు నమ్మలేనట్టుగా.. కాసేపు నన్ను ఎగాదిగా చూసి వెళ్ళిపోయాడు.
నేరుగా ఇంట్లోకి వచ్చాను. సింక్‌లో గిన్నెలు మా సంగతి ఏంటి అన్నట్టు కళ్ళింత చేసుకు చూస్తున్నాయి. పాలు పొయ్యి మీద పెట్టి స్టవ్‌ ఆన్‌ చేసాను. ఏంటో కడుపులో ఒక రకమైన బాధ. ఏంటా అని ఆలోచిస్తే నాకు ఆకలి వేస్తోందని అర్ధమైంది. సీత వుంటే ఈ సమయానికి మంచి కాఫీ ఇచ్చేది కదా! సరే సీత లేకపోతే ఏం నేను పెట్టుకోలేనా అని మొండిగా అనుకున్నాను. పాలు మరిగేలోగా బ్రష్‌ చేద్దామని పెరట్లోకెళ్ళాను. వచ్చి చూద్దును కదా పాలన్నీ పొంగిపోయాయి.
‘మీరు బైట పనులు చేసేటప్పుడు పాలని సిమ్‌లో పెట్టండి’ అని సీత చెప్పడం గుర్తొచ్చింది. ‘అబ్బా ఆ మాత్రం నాకు తెలీదూ!’ అని నేను విసుక్కోవడం కూడా గుర్తొచ్చింది.
కర్మ అనుకుంటూ ముందుకి కదిలి స్టవ్‌ ఆఫ్‌ చేశాను. ఆ వంటగది ప్లాట్‌ ఫాం పైన ఏదో గోదావరి నది, సముద్రంలో ఏకం కావడానికి పరవళ్ళు తొక్కుతూ ప్రవహించినట్టు ఆ పాలు, సింక్‌ నీళ్ళతో కలిసిపోవడానికి ఆత్రంగా ముందుకు కదులుతున్నాయి. నాకు ఆ దృశ్యం చూస్తే చెప్పలేనంత నీరసం వచ్చింది.
‘ఏవిటోరు! ఎప్పుడూ వంటగదిలో చేసిన పనే చేస్తూ కనిపిస్తావ్‌’ అని సీతని ఎన్నిసార్లు అనేవాడ్ని. మరి ఇలాంటి పనులంటే చేసినపనే చెయ్యకుండా ఎలా వుంటారు ఎవరైనా? పాలు స్టవ్‌ మీద నుండీ దించేసి అదంతా శుభ్రం చెయ్యడంలో మునిగిపోయాను. తర్వాత గిన్నెలు తోమి, నీళ్ళు పడ్డ గచ్చంతా శుభ్రం చేసి.. పట్టేసిన నడుముని కాస్త నొక్కుకున్నాను.
‘రోజూ రాత్రయ్యేసరికి ఒళ్ళంతా నొప్పులండీ.. ఏవైనా టాబ్లెట్స్‌ తెస్తారూ’ అని సీత అనడం.. ‘చిన్న చిన్న నొప్పులకి టాబ్లెట్లు వాడకూడదు సీత! నిద్రలో అవే తగ్గిపోతాయి వదిలెరు’ అని నేను బదులివ్వడం గుర్తొచ్చింది.
రోజూ పొద్దున్న అయ్యేసరికి మీదపడే ఈ పనులకి ఆ నొప్పులు తగ్గమన్నా తగ్గవని నాకెందుకు తట్టలేదు. ఈ ఆలోచనలతో నాకు ఆకలి చచ్చిపోయింది. ఏమీ తినాలనిపించలేదు ఒకటే వికారం. అరచేతులు వాసన చూసుకున్నాను అప్పుడే గిన్నెలు తోమానేమో.. ఆ సబ్బు వాసనే వచ్చింది. కడుపులో దేవినట్టైంది.
‘ఛీ ఏవిటి సీత నీ చేతిని ముద్దు పెట్టుకుందామంటే ఎప్పుడూ ఈ చెత్త వాసన’ అని ఆమె చేతిని విదిలించడం నాకు గుర్తొచ్చి బాధ వుప్పొంగింది.
ఆ క్షణం సీత కళ్ళల్లో కనబడ్డ నీటి తెరని.. భ్రమ అనుకొన్నాను ఆ రోజు. కానీ ఇప్పుడు అది నిజమనిపిస్తుంది. సీతకి ఎంత బాధేసుంటుంది ఆ క్షణం. ఎంత మూర్ఖుడిని నేను! అని నా మీద నాకే ఎక్కడలేని కోపమొచ్చింది. ఇంతలో ఫోన్‌ మోగింది. ఆఫీస్‌ కొలీగ్‌..! ఇంకా రాలేదేంటని. టైం చూసుకున్నాను తొమ్మిదిన్నర. కాస్త తలనొప్పిగా వుందని సాకు చెప్పి సెలవు పెట్టేసాను. సోఫాలో కూలబడి ఆలోచించాను.
నాకు సీతంటే ఇష్టం.. ఆమెతో కబుర్లు చెప్పడం ఇష్టం.. సీతతో షికార్లకెళ్ళడం ఇష్టం.. కానీ తనతో కలిసి ఇంటి పనులు చెయ్యడం నాకు ఎందుకు ఇష్టం వుండదు..? అసలు చెయ్యాలనే ఆలోచనే ఎందుకు రాదు? నా కళ్ళముందు ఎంతపని కనిపిస్తున్నా.. కొన్నిసార్లు ఆమె చేసేది కేవలం నా కోసమే అయినా.. నాకు అందులో ప్రమేయం లేదు అని ఎలా అనుకున్నాను.. అది తనకి మాత్రమే కేటాయించిన పనిగా ఎందుకు అనుకున్నాను. ఇలా ఎడతెరిపి లేని ఆలోచనలు. అసలు సీత మనసులో ఏమనుకుంటుందో నేను ఎప్పుడైనా తెలుసుకున్నానా? నీకిదంతా నచ్చుతుందా అని మాటవరసకి కూడా అడగలేదే! అసలు ఏవో కోరికలతో, ఎన్నో ఆశలతో పెరిగిన అమ్మాయి.. సొంత వాళ్ళని వదిలేసి నా కోసం ఇక్కడదాక వచ్చింది ఈ పనులు చేయడానికా? నేను ఇదంతా చెయ్యను అని ఆమె అంటే నేను ఏం చేసేవాడిని. కోప్పడే వాడినా. అవును నాకు తేలిగ్గా వచ్చేది అదే కదా! ఇలా అనుకుంటూ నాకు తెలీకుండానే తల కొట్టుకున్నాను. రేసు గుర్రాల్లా పరిగెడుతున్న ఆలోచనలకి కళ్ళెం వేసినట్టు.. సీత ఎప్పుడో అన్న కొన్ని మాటలు గుర్తొచ్చాయి. ‘ప్రతీ రోజు ఎందుకు చేస్తున్నామో ఎవరి కోసం చేస్తున్నామో కూడా తెలీకుండా తమని తాము యంత్రాలుగా మార్చుకుని ఇంటిని నడిపే ఆడవాళ్ళు ఎందరున్నారో లెక్కేలేదు. ఈ ఇంటిపని, వంటపని అనేది ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాల్సింది అని ఎవరు నిర్ణయించారు. అది మగవాళ్ళు చేస్తే నామోషి అని అవమానం అని ఎందుకు అనుకుంటారు. నిజానికి అలా భార్యకో, తల్లికో వారి పనుల్లో సహాయం చేసినప్పుడే మగవాడు ఆ ఇంట్లో నిజమైన గౌరవాన్ని పొందగలుగుతాడని జనానికి ఎందుకు అర్థం కాదు’ అని అన్నది ఆ రోజు.
నేను విన్నాను కానీ అర్థంచేసుకోలేదు. కనీసం ఆ ప్రయత్నం కూడా చెయ్యలేదు. అంటే సీత అసంతృప్తి నాకు తెలుసు.. అయినా నేను పట్టించుకోలేదు. ఎంత హృదయం లేనివాడిని. నిజానికి సీత హాయిగా, ప్రశాంతంగా ఏ రోజూ లేదు. ఆమె అలా వున్నదని నేనే వూహించుకున్నాను. అలా వుండాలని బలంగా కోరుకున్నాను. అందుకే నాకు తనలోని మరొక పార్శ్వం కనిపించలేదు. కాదు కాదు.. నా నిర్లక్ష్యంవల్ల నేను కనుగొనలేకపోయాను. ఆమె లోతుగా చూసే చూపు వెనుక.. ముభావంగా నవ్వే ఆ నవ్వు వెనుక.. ఎన్నో ప్రశ్నలు దాగుండి వుంటాయని ఇప్పుడు అనిపిస్తుంది. అవి ఏమై వుంటాయో? ఎప్పుడైనా ఈ పనుల వల్ల ఆమెకి విసుగు పుట్టి వుంటుందా? ఒకవేళ అలా పుట్టుంటే సీత విరక్తితో.. నన్ను వదిలి వెళ్ళిపోతుందా? అలా వెళ్ళిపోతే నేనేం చెయ్యాలి? అసలు ఏం చెయ్యగలను? ఆ ఊహకే నాకు ఒళ్ళు జలదరించింది. అది సీత దూరమవుతుందన్న భయమో.. ఈ పనులన్నీ నేనే చేసుకోవాలి అనే బీథితో.. నాకాక్షణం తెలియలేదు.

వి. సృజన
7673905655

➡️