భూభ్రమణంలో మార్పులా..

Jun 30,2024 09:36 #Sneha

భూమి నాలుగు పొరలను కలిగి ఉంటుంది. వాటిలో ఇన్నర్‌ కోర్‌ (లోపలి పొర) ఘన రూపంలో ఉండి ఇనుము, నికెల్‌ మూలకాలతో ఏర్పడింది. ఇది భూమికి కేంద్రభాగమని చెప్పవచ్చు. 2010లో ఈ కోర్‌ భ్రమణం తగ్గుతుందని గమనించారు శాస్త్రవేత్తలు. భూమి ఉపరితలంతో పోలిస్తే, లోపలిపొర భ్రమణం క్రమేపీ మందగిస్తున్నట్లు ఇటీవల పరిశోధనల నివేదిక శాస్త్రవేత్తలు. ‘ఇది స్పష్టమైన రుజువు’ అంటున్నారు ఎర్త్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ మిస్టర్‌ విడేల్‌. ఈయన యూనివర్శిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా డోర్న్‌సైఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ లెటర్స్‌, ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ డీన్‌ కూడా.

భూమి అనేది డైనమిక్‌ గ్రహం. ఇది ఉనికిలోకి వచ్చినప్పటి నుండి నిరంతరం మార్పులకు లోనవుతూనే ఉంది. భూమి లోపల శక్తివంతమైన ఉష్ణప్రసరణ కణాలుంటాయి. వీటి చలనంలోని హెచ్చుతగ్గుల వలనే భూకంపాలు రావడం, అగ్నిపర్వతాలు పేలి పర్వత శ్రేణులు ఏర్పడటం సంభవిస్తున్నాయి. మన చుట్టూ ఉండే గాలి (వాతావరణం), నీరు (జలాశయాలు), భూమి, జీవులు.. భూవ్యవస్థ కింది ఉపవ్యవస్థలు. ఇవన్నీ పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి.

లోపలి కోర్‌..
భూమి లోపలిపొర భూఉపరితలం నుండి 4,800 కిలోమీటర్లు లోపలికి ఉంటుంది. ఇది దాదాపు చంద్రుని పరిమాణంలో ఉంటుంది. అంటే భూమి కంటె ఒకశాతం కన్నా తక్కువ పరిమాణం. అయినా మొత్తం అయస్కాంత క్షేత్ర శక్తిలో పది శాతం ఈ ఇన్నర్‌కోర్‌నే ఆవరించి ఉంటుంది. ఈ అయస్కాంత క్షేత్రమే జీవి మనుగడకు కీలకం.
లోపలి కోర్‌ వెలుపలి భాగంమాత్రం ఇనుము, నికెల్‌ పదార్ధంతో ఉంటుంది. ఇది 2,200 కిమీ మందం, అధిక ఉష్ణోగ్రతను కలిగిన కణ నిర్మితం. ఈ కణాల కదలిక అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. అయస్కాంత క్షేత్రం భూమి వాతావరణం చుట్టూ విస్తరించి ఉంటుంది. ఈ క్షేత్రం కింద ఉండే ద్రవ ప్రవాహం భూ భ్రమణాన్ని సమన్వయ పరుస్తుంది. భూమి లోపలి పొరల నుండి ఉపరితలానికి పయనించే అయస్కాంత తరంగాలు అంతరిక్ష వికిరణానికి లోనుకాకుండా భూమిని రక్షిస్తాయి.

అధ్యయనాలెన్నో..
భూమి లోపలి కోర్‌, భూ ఉపరితలం కంటే చాలా నెమ్మదిగా తిరుగుతున్నట్లు ఇటీవల అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. లోపలికోర్‌ భ్రమణవేగం తగ్గటం 2010 నుంచి ప్రారంభమైందని.. 1991-2023 సంవత్సరాల మధ్య దక్షిణ అట్లాంటిక్‌లోని దక్షిణ శాండ్‌విచ్‌ దీవుల్లో జరిగిన అధ్యయనంలో ఈ విషయం రుజువైందంటారు జాన్‌ విడేల్‌, అతని బృందం.
ఆయా పునరావృత భూకంపాల నుండి 121 రీడింగ్‌ నమూనాలను సేకరించారు. అంతేకాక 1971-1974 మధ్య నిర్వహించిన సోవియట్‌ అణు పరీక్షల డేటా, ఫ్రెంచ్‌, అమెరికన్‌ అణు పరీక్షల డేటాలను కూడా ఈ అధ్యయనంలో పరీక్షించారు. ఈ మార్పును భూకంపాలు, అణు పరీక్షల ద్వారా ఉత్పన్నమయ్యే భూకంప తరంగాలపై అధ్యయనాలు జరిపి నిర్ధారించారు.

ఇలా నమ్మాల్సివచ్చింది..
‘ఈ మార్పును సూచించే సీస్మోగ్రామ్‌ (భూమి కదలికలను రికార్డుచేసి చూపించే పరికరం)ను మొదటిసారి చూసినప్పుడు మేము స్టన్‌ అయ్యాం. దానిపై అనేక పరీక్షలు జరిపినప్పటికీ అదే నమూనాను పదేపదే సూచించడం.. ‘ఇదే స్పష్టమైన నిర్ధారణగా నమ్మాం’ అంటారు ప్రొఫెసర్‌ విడేల్‌. అంతర్గత కోర్‌ భ్రమణం 2009లో దాదాపుగా ఆగిపోయి, తర్వాత వ్యతిరేక దిశలో తిరగటం ప్రారంభించిందని చైనాలో పెకింగ్‌ యూనివర్శిటీకి చెందిన జియాడాంగ్‌ సాంగ్‌, యి యాంగ్‌ల నివేదిక. ‘భూమి యొక్క ఉపరితలానికి సంబంధించి, లోపలి కోర్‌ ఒక స్వింగ్‌ లాగా ముందుకు వెనుకకు తిరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఈ పరిస్థితులవలన..
పగలు, రాత్రుల నిడివి ఒక్కొక్కటి ఆరు నెలల వరకు పెరుగుతుంది. వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. గాలి, సముద్ర ప్రవాహాలు భూ భ్రమణం మీదే ఆధారపడి ఉంటాయి. భూ అయస్కాంత క్షేత్రంలో మార్పులు.సంభవిస్తాయి. భూమి గురుత్వాకర్షణ శక్తి తగ్గటం.. రోజుకు 24 గంటల కాలగమనంలో మార్పు రావటం.. ఈ రెండింటిపై లోపలిపొర భ్రమణ వేగంలో వచ్చిన ఈమార్పు గణనీయమైన ప్రభావం చూపుతుందంటున్నారు పరిశోధకులు.

➡️