ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పంటనష్టం : టిడిపి

తెనాలి మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తదితరులు
ప్రజాశక్తి-తెనాలిరూరల్‌ :
మిచౌంగ్‌ తుపాను కారణంగా మండలంలోని గుడివాడ, హాఫ్‌పేట ప్రాంతాల్లో నీటమునిగిన వరిపంటను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ గురువారం పరిశీలించారు. రైతులతో మాట్లాడిన ఆయన.. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణ పరిహారం అందించాలని కోరారు. ప్రభుత్వ అలసత్వం కారణంగానే రైతు నష్టపోయాడని అన్నారు. డ్రెయిన్లు, కాల్వల్లో పూడికలు తీయించక, తూటికాడ తొలగించక నీటి పారుదల లేదని, ఇదే పొలాల్లో నీరు నిలవడానికి కారణమని అన్నారు. రైతు పండించిన ప్రతి గింజను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ అధికారులు సలహాలతో మిగిలిన పంటను సంరక్షించుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో గుడివాడ సర్పంచ్‌ యడ్లపాటి రాకేష్‌, కె.చంద్రమోహన్‌, జి.చందు, అనిత, టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ప్రజాశక్తి – చేబ్రోలు : తుపాను బాధిత రైతులకు రాజకీయ వివక్ష లేకుండా నష్టపరిహారం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే డి.నరేంద్రకుమార్‌ కోరారు. మండలంలోని చేబ్రోలు, శేకూరు, శలపాడు, సుద్ధపల్లి, వెజెండ్ల, నారాకోడూరు గ్రామాలలో దెబ్బతిన్న పొలాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు ఎం.వెంకట రామరాజు, లక్ష్మీనారాయణ, జె.వెంకటరామయ్య, మాజీ ఎంపీపీ ఖాదర్‌బాషా, పి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.ప్రజాశక్తి – పెదకాకాని రూరల్‌ :మండలంలోని నంబూరులో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్‌ పరిశీలించారు. ఆపద ముంచుకొస్తుందని తెలిసినా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడ వల్లే రైతులు ఇంతగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ముఖ్యంగా డ్రెయినేజీ, ఇరిగేషన్‌, కాలులు బాగా చేయాలని కోరారు.

➡️