బిజెపి కార్పొరేట్, మతతత్వ విధానాలను ప్రతిఘటిద్దాం

Feb 15,2024 14:53 #bike rally, #vijayanagaram
  • గ్రామీణ భారత్ బంద్ ను విజయవంతం చేయండి
  • కార్మిక, రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేతలు పిలుపు.. నగరంలో బైక్ ర్యాలీ

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మోడీ కార్పొరేట్‌, మతతత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 16 న జరిగే రైతాంగ, కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని గురువారం ఉదయం ఎఐటియుసి, సిఐటియు, ఎఐకెఎస్‌ కార్మిక, రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో కోట జంక్షన్‌ నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్‌ ర్యాలీ స్థానిక కోట జంక్షన్‌ నుండి ప్రారంభమై మూడు లాంతర్లు, గంట స్థంభం, కన్యకాపరమేశ్వరి ఆలయం, ఎన్‌ సి ఎస్‌, రైల్వే స్టేషన్‌ మీదుగా ఆర్టీసి కాంప్లెక్స్‌ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యులు పూదోట ప్రకాష్‌, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.సుబ్బరామమ్మ, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షుడు మొదిలి శ్రీనువాసరావు లు మాట్లాడుతూ.. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాడని, కార్పొరేట్లకు అనుకూలంగా విధానాలను రూపొందిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తూ దేశానికి తీవ్రతరమైన నష్టం కలిగిస్తున్నాడని ఆయన విమర్శించారు. ఇంకొక వైపు తమ పంటలకు చట్టబద్ధమైన కనీసం మద్దతు ధరను ప్రకటించాలని, విద్యుత్‌ చట్టాలను ఉపసంహరించుకోవాలని, 60 సంవత్సరాల పైబడిన వ్యవసాయ కూలీలకు పదివేల రూపాయల పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్న రైతాంగం మీద మోడీ పాదం మోపుతూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడని ఆయన దుయ్యబట్టారు. గతంలో మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చమని ప్రస్తుతము రైతాంగం డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు పూనుకుందన్నారు. రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెప్పింది మోడీనేనని.. పంట మీద అయ్యే పెట్టుబడికి మించి 50 శాతం లాభంతో మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పింది కూడా మోడీనేనని.. అయితే ఇచ్చిన వాగ్దానాలన్నీ తప్పినట్టే ఈ వాగ్దానాన్ని కూడా మోడీ తుంగలో తొక్కాడని, రైతు వ్యతిరేకి కార్మిక వ్యతిరేకి ఆయన మోడీకి తగిన విధంగా బుద్ధి చెప్పాలంటే ఈనెల 16వ తారీకున జరుగుతున్న రైతాంగ కార్మిక సమ్మెను జయప్రదం చేయాల్సిన అనివార్యత మన మీద ఉందన్నారు. ఈ పోరాటంలో రైతులు కార్మికులు యువకులు, విద్యార్థులు అందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఎస్‌ రంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్‌, క్లాప్‌ వెహికల్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ ఎఐటియుసి అనుబంధం రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు పొడుగు రామకష్ణ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకి సురేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి శంకర్రావు, జగన్‌, బి రమణ, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు,ఐఎన్టియుసి నాయకులు శ్రీను కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

➡️