ముగిసిన నాటకోత్సవాలు

సీనియర్‌ కళాకారులు కెఎస్‌కె సాయిని సన్మానిస్తున్న మంత్రి అంబటి రాంబాబు
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
గుంటూరు శ్రీ వేంకటేశ్వర విజ్ఞానమందిరంలో వారం రోజుల పాటు జరిగిన నంది నాటకోత్సవాలు విజయవంతం అయ్యాయి. నాటకోత్సవాల్లో భాగంగా వారం రోజుల్లో 38 ప్రదర్శనలు చేశారు. శుక్రవారం విజేతలకు 73 స్వర్ణ, రజిత, కాంస్య నందుల ప్రదానం చేశారు. ఎన్‌టిఆర్‌ రంగస్థల, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ రంగస్థల పురస్కారాలను మంత్రి అంబటి రాంబాబు అందచేశారు. ఎన్‌టిఆర్‌ రంగస్థల అవార్డు-2022ను విశాఖపట్నంకు చెందిన ప్రముఖ రంగస్థల నటులు, రచయిత డాక్టర్‌ మీగడ రామలింగ స్వామికి ప్రదానం చేయడంతోపాటు గజమాలతో సన్మానించి జ్ఞాపిక, రూ.లక్షన్నర చెక్కు అందించారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ అవార్డు-2023 కాకినాడకు చెందిన యంగ్‌ మెన్స్‌ హ్యపీ క్లబ్‌ ప్రతినిధులను గజమాలతో సన్మానించి జ్ఞాపిక, రూ.5 లక్షల చెక్కు అందించారు. సినీయర్‌ నాటక కళాకారులు కెఎస్‌కె సాయిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ కళలలో నాటక రంగం మొదటిదని, ఈ రంగంలో విజయవంతమైన వారు సినిమాల్లోను విజయాలు సాధిస్తారని అన్నారు. నాటకాల ప్రదర్శన చాల కష్టతరమైనదని, మంచి సందేశాన్ని అందించే నాటకాలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సంక్షిప్త రూపంలో ప్రదర్శిస్తున్నారని చెప్పారు. సినిమాల్లో, టీవీలో నటించేవారు డబ్బు సంపాదిస్తారని, నాటకం రంగంలో డబ్బులు పోగొట్టుకున్న నటీ, నటీనటులే ఎక్కువ మంది ఉన్నారని అన్నారు. నాటక కళాకారులకు డబ్బు కంటే ప్రేక్షకులు కోట్టే చప్పట్లే గౌరవాన్ని ఇస్తాయన్నారు. ప్రజలను ఆకట్టుకునేలా రాజకీయ నాయకులు ప్రసంగాలు చేయాలన్నా మాడ్యూలేషన్‌తో మాట్లాడే నాటకరంగంలో అనుభవం తప్పనిసరి అని చెప్పారు. రాష్ట్ర చలనచిత్ర టివి, నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ కరోనా కారణంగా రెండున్నరేళ్లు ఇబ్బంది ఉండటంతో తొలుత నాటక రంగానికి సంబంధించి నంది నాటకోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. నంది నాటకోత్సవాల్లో అర్హతున్న వారికే నంది బహుమతులు అందించేందుకు నిష్ణాతులైన న్యాయనిర్ణేతలను నియమించటంతో పాటు వారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామన్నారు. నాటక ప్రదర్శనలలో అత్యుత్తమమైనవి ఎంపిక చేయటానికి, ఎన్‌టిఆర్‌, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ రంగస్థల పురస్కారాల ఎంపికకు ప్రపంచంలోనే ఎప్పుడు లేని విధంగా 27 మంది న్యాయనిర్ణేతలను నియమించామని చెప్పారు. విజేతల ఎంపికలో ఎక్కడైనా పొరపాటుంటే చొక్కా పట్టుకుని నిలదీయాలనీ, లై డిటెక్టర్‌ పరీక్షకు సైతం తాను సిద్ధంగా ఉన్నాని అన్నారు. పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ తుమ్మా విజరు కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నందినాటకోత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 115 ఎంట్రీలను ప్రాథమికంగా సెప్టెంబరులో పరిశీలించి వాటిలో పద్య నాటకం, సాంఘిక నాటకం, సాంఘిక నాటిక, బాలల నాటిక, విశ్వవిద్యాలయ, కళాశాల నాటిక విభాగాల్లో 38 నాటకాలను తుది పోటీలకు ఎంపిక చేశామని వివరించారు. అనంతరం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వారికి, వివిధ కమిటీల బాధ్యతలు నిర్వహించిన అధికారలు, ఉద్యోగులను సన్మానించి జ్ఞాపికలు అందించారు. పద్య నాటకాల్లో మాధవవర్మ, శ్రీకాంత కృష్ణమాచార్య, వసంత రాజీయం, సాంఘిక నాటకాల్లో ఇంద్రప్రస్తం, ఇంపోస్టర్స్‌, కలనేత, సాంఘిక నాటికల్లో ఆస్థికలు, కమనీయం, చీకటి పువ్వు, బాలల నాటికలలో ప్రపంచ తంత్రం, బాధ్యత, మూడు ప్రశ్నలు యూనివర్సిటీ/కాలేజి నాటికలలో ‘ఇంకానా’, కపిరాజు, ఉద్దంసింగ్‌ ఎంపికయ్యాయి. ప్రథమ స్వర్ణ నంది, ద్వితీయ రజిత నంది, తృతీయ కాంస్య నందులను పోసాని కృష్ణమురళీ, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ విజరు కుమార్‌రెడ్డి అందించారు.

➡️