రబీ నాట్లు సకాలంలో పూర్తయ్యేనా..!

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

రబీనాట్లు సకాలంలో పూర్తయ్యేనా అనే అనుమానం నెలకొంది. అధికారులు చెబుతున్న ప్రణాళికకు జరుగుతున్న పరిస్థితికి సంబంధం లేకుండాపోయింది. నవంబర్‌ పూర్తవుతున్నా ఇంకా రబీ నారుమడులు ముమ్మరంగా ప్రారంభం కాకపోవడంతో నాట్లు ఎప్పటికి పూర్తయ్యేనో అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ నెల 14, 15 తేదీల్లో రెండు జిల్లాలోనూ సాగునీటి సలహామండలి సమావేశాలు జరిగాయి. రబీ సాగుకు పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేయాలని సాగునీటి సలహామండలి సమావేశాల్లో నిర్ణయించారు. పూర్తిస్థాయిలో నీరు అందుబాటులో లేకపోవడంతో వంతులవారీ విధానంతోపాటు పలు చర్యలు చేపట్టి సాగునీరు అందించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 4.60 లక్షల ఎకరాల్లో రబీలో వరి సాగవుతుండగా, ఏలూరు జిల్లాలో 56,190 ఎకరాలు, పశ్చిమగోదావరి జిల్లాలో 2.40 లక్షల ఎకరాల వరకూ రబీ సాగు సాగనుంది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని 8,96,507 ఎకరాలకు 91.35 టిఎంసిల నీరు అవసరమని అధికారులు తేల్చారు. అయితే గోదావరి ప్రవాహాల ద్వారా వచ్చే నీటి లభ్యత 30 టిఎంసిలు, సీలేరు నుంచి 40.49 టిఎంసిలు, పోలవరం ప్రాజెక్టులో నీటినిల్వలు 12 టిఎంసిలు మొత్తం 82.49 టిఎంసిల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. దాదాపు పది టిఎంసిల నీరు లోటు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. మొత్తం సాగుకు నీరు అందించాలంటే వంతులవారీ విధానం, ఆయిల్‌ ఇంజిన్లు ద్వారా నీటిని ఎత్తిపోయడం, డ్రెయిన్లపై అడ్డుకట్టలు వేయడం ద్వారా సాగునీరు అందించాలని సాగునీటి సలహామండలి సమావేశంలో తీర్మానించారు. అందుకుగాను నవంబర్‌ నెలాఖరుకు నారుమడులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్‌ నెలాఖరుకు నాట్లు పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. మార్చి నెలాఖరున కాలువలు మూసివేయాలనే నిర్ణయం సైతం జరిగింది. అయితే ఇప్పటికీ రెండు జిల్లాల్లోనూ నారుమడులు ప్రారంభంకాని పరిస్థితి నెలకొంది. ఖరీఫ్‌ మాసూళ్లు ఇంకా 60 శాతంపైగా పూర్తికాని పరిస్థితి ఉంది. ఖరీఫ్‌ మాసూళ్లు పూర్తయ్యి రబీ నారుమడులు పూర్తయ్యేసరికి చాలా సమయం పట్టే పరిస్థితి కన్పిస్తోంది. రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు సైతం సరైన ప్రణాళికలు రూపొందించలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. నారుమడులు ఆలస్యమైతే జనవరి నెలాఖరు వరకూ రబీ నాట్లు కొనసాగే పరిస్థితి రానుంది. అదే జరిగితే రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడనుంది. జనవరి వచ్చేసరికి గోదావరి జలాలు మరింత తగ్గిపోతాయి. వంతులవారీ విధానం ప్రారంభమవుతుంది. శివారు పొలాలకు సాగునీటి పంపిణీ కష్టతరంగా మారనుంది. అదే జరిగితే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రానుంది. రైతులకు అవగాహన కల్పించి రబీ నారుమడుల డిసెంబర్‌ పదో తేదీలోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటేనే రబీసాగు సాఫీగా సాగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేకపోతే సాగునీటి ఇబ్బందులు తలెత్తి పంట దెబ్బతినే ప్రమాదం ఏర్పడనుంది. ఇప్పటికైనా అధికారులు అందుకు తగిన చర్యలు తీసుకుంటే రైతులకు మేలు జరుగుతుంది. ఇప్పటికే ఖరీఫ్‌ పంటను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డ రైతాంగం రబీలోనూ కష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.

➡️