విద్యతోనే ఆర్థిక స్థితిగతులు మెరుగు పోటీ

ప్రజాశక్తి-శృంగవరపుకోట  :  మంచి విలువలతో కూడిన విద్య మన ఆర్థిక స్థితిగతులను మార్చుతుందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ తెలిపారు. పట్టణంలోని టిడిపి కార్యాలయంలో తెలుగు యువత వేపాడ మండల అధ్యక్షులు రామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గొంప కృష్ణ విద్యాసంకల్పం పుస్తక వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇటీవల నిర్వహించిన మోడల్‌ టెస్టులో ప్రతిభ కనబర్చిన 175 మంది విద్యార్థులకు రూ.18 లక్షల విలువ చేసే పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం పోటీ పరీక్షలకు చదువుకుని ఉన్నత కొలువులు సాధించాలని సూచించారు. తాను రాజకీయాల్లో ఉన్నా, లేకున్నా నియోజకవర్గంలో ఉన్న యువత ఆకాంక్షలను తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తానని హామీనిచ్చారు. వారం రోజుల్లో 100 మంది మహిళలకు బ్యూటిఫికేషన్‌, టైలరింగ్‌ వంటి శిక్షణ 3 నెలల పాటు ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించారు. పోటీ పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన గనివాడ గౌరినాయుడు, పల్లి శ్రావణి, గోగాడ వెంకటరమణ ఎక్కడ కోచింగ్‌ తీసుకున్నా ఫీజులకు అవసరమైన నగదు అందిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో టిడిపి విశాఖ పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు రాయవరపు చంద్రశేఖర్‌, జామి మండల అధ్యక్షుడు లగుడు రవికుమార్‌, సీనియర్‌ నాయకులు గుమ్మడి భారతి, జుత్తాడ రామసత్యం, లగుడు ఎర్నాయుడు, ఎం.మంగరాజు, జామి మాజీ సర్పంచ్‌ ఇప్పాక త్రివేణి, బంగారు నాయుడు పాల్గొన్నారు.

➡️