ఎన్నికల విధుల్లో12,522 మంది సిబ్బంది

Apr 27,2024 21:57

నియోజకవర్గాల కేటాయింపు ప్రక్రియ పూర్తి

మహిళా ఉద్యోగులకు అదే నియోజకవర్గం కేటాయింపు

ప్రజాశక్తి-విజయనగరం/కోట :జిల్లాలో వచ్చే నెల 13న జరగనున్న సాధారణ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు అవసరమైన పిఒ, ఎపిఒ., ఒపిఒల కేటాయింపు ప్రక్రియ శనివారం పూర్తయ్యింది. కలెక్టర్‌ కార్యాలయంలోని నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌ లో రేండమైజేషన్‌ ప్రక్రియ ద్వారా జిల్లాలోని 12,522 మంది ఎన్నికల సిబ్బందిని నియోజకవర్గాలకు కేటాయించే ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, ఎన్నికల సాధారణ పరిశీలకులు హనిష్‌ చాబ్రా, సీతారాం జాట్‌ తదితరుల సమక్షంలో ఎన్‌ఐసి అధికారులు నిర్వహించారు. మహిళా ఉద్యోగులకు వారు పనిచేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే వేరొక మండలంలో ఎన్నికల విధుల్లో నియమిస్తున్నామని, పురుష సిబ్బందికి ఇతర నియోజవర్గాల్లో ఎన్నికల విధుల్లో నియమిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ తెలిపారు. పిఒ, ఎపిఒలు 2087 మందిని, ఇతర పోలింగ్‌ సిబ్బంది 8,348మందిని కేటాయించినట్టు పేర్కొన్నారు. మూడో విడత రెండమైజేషన్‌ ప్రక్రియ మే 11వ తేదీన జరుగుతుంది. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ బి.సహదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, ఎన్‌ఐసి అధికారులు నరేంద్ర, బాల సుబ్రహ్మణ్యం, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️