ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి

May 5,2024 00:17
ఈవిఎంలపై అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-పాడేరు:సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత స్పష్టం చేసారు. స్థానిక గురుకుల కళాశాలలో రంపచోడవరం, అరకు వ్యాలీ, పాడేరు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని 489 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు ఇవిఎంల వినియోగంపై నిర్వహించిన రెండవ విడత శిక్షణా కార్యక్రమంలో శనివారం మధ్యాహ్నం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, అధికారులు నిరంతరం సమన్వయంతో సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని చెప్పారు. మాక్‌ పోలింగ్‌ ప్రక్రియ నుండి పోలింగ్‌ రోజు నిర్వహించాల్సిన అంశాలపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలన్నారు. ఎన్నికల విధుల్లో ప్రతికూల పరిస్థిలు ఎదురైనా ధైర్యంగా విధులు పూర్తి చేయాలని పేర్కొన్నారు.జిల్లా ఎన్నికల పరిశీలకులు కె.వివేకానందన్‌ మాట్లాడుతూ, ఎన్నికల సిబ్బందికి వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేయాలని సూచించారు. పోలింగ్‌ ప్రక్రియపై రూపొందించిన వీడియోను పదే పదే పరిశీలించి అవగాహన పెంచుకోవాలన్నారు. పాఠశాల తరగతి గదుల్లో విద్యార్ధులకు బోధించడానికి ఏర్పాటు చేసిన చిత్రాలను కవర్‌ చేయాలని చెప్పారు.అరకు వ్యాలీ అసెంబ్లీ నియోజక వర్గం రిటర్నింగ్‌ అధికారి, ఐటిడి ఏ పిఓ వి.అభిషేక్‌, పాడేరు అసెంబ్లీ నియోజక వర్గం రిటర్నింగ్‌ అధికారి జాయింట్‌ కలెక్టర్‌ భావనా వశిష్ట్‌ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణ, పోలింగ్‌ విధానంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేసి వివరించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను సద్వినియోగం చేసుకుని పోలింగ్‌ను విజయవంతం చేయాలని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేసారు. ఫారం 17సి, మాక్‌ పోల్‌ సర్టిఫికేట్‌, బ్లాక్‌ కవర్‌ సర్టిఫికేట్లను సక్రమంగా స్ట్రాంగ్‌ రూంకి తిరిగి అప్పగించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్‌ ట్రైనర్లు, రంపచోడవరం, పాడేరు, అరకు వ్యాలీ అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన ప్రిసైడింగ్‌ అధికారులు, ఎపిఓలు తదితరులు పాల్గొన్నారు.

➡️