టిడిపి రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తా

Apr 12,2024 00:14
మాట్లాడుతున్న దొన్నుదొర

ప్రజాశక్తి -అరకులోయ :తెలుగుదేశం పార్టీ అధిష్టానం తనకు పార్టీ టికెట్‌ ఇచ్చి మోసం చేసిందని, దీంతో తాను టిడిపి రెబల్‌ అభ్యర్థిగా అరకు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ సమన్వయకర్త దొన్నుదొర స్పష్టం చేశారు. గురువారం అరకులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దొన్నుదొర మాట్లాడుతూ, 10 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని అరకు నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి తీవ్రంగా శ్రమించినట్లు తెలిపారు. పార్టీ అధిష్టానం అరకులో జరిగిన బహిరంగ రా కదలిరా సభలో అధినేత చంద్రబాబు నాయుడు తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారని ఆయన అన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా సంబరపడి అవిశ్రాంతంగా గ్రామాల్లో తిరిగి ప్రచారం చేశామన్నారు. ఇటువంటి తరుణంలో ఓటు బ్యాంకు లేని బీజేపీతో అధినేత జతకట్టి పొత్తులో భాగంగా తన టికెట్టును క్యాన్సల్‌ చేసి బిజెపి అభ్యర్థి పాంగి రాజారావుకు కేటాయించడం తనను తీవ్రంగా కుంగ దీసిందన్నారు. కార్యకర్తల మనోభావాలను తీసుకోకుండా బిజెపికి ఈ టికెట్‌ కేటాయించడం ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. నియోజక వర్గంలోని ఆరు మండలాల నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకు తాను అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. అరకు నియోజకవర్గంలో బిజెపికి సహకరించేది లేదని స్పష్టం చేశారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినప్పటికీ ఆ మాటలు నాయకులు, కార్యకర్తలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు.బిజెపికి అరకు టికెట్‌ కేటాయించడంతో ఇక్కడి టిడిపి శ్రేణుల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన అన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు నాయకులకు తాను ద్రోహం చేయనని వారి నిర్ణయం మేరకే రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దలబుడు మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ పెట్టేలి దాసుబాబు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️