అభివృద్ధి పనులకు నిధుల మంజూరు

Jan 23,2024 00:02
ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న బూడి

ప్రజాశక్తి- మాడుగుల:గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అన్నారు. సోమవారం మండలంలోని ఎం.కోటపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బూడి గడపగడపకు వైయస్సార్‌ పథకాలను తెలియజేశారు. సుమారు 520 గృహాలను సందర్శించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలను లబ్దిదారులకు సవివరంగా వివరించారు. ఎమ్‌.కోటపాడు, వల్లపురం గ్రామాలలో 163 మంది లబ్ధిదారుల జగనన్న గృహాలకు ఉచితంగా విద్యుత్‌ మీటర్లను అందజేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా రూ 1.48 కోట్లతో ఇంటికి కుళాయిలు ఏర్పాటులో భాగంగా రెండు గ్రామాల్లో ఇళ్లకు 1050 కుళాయిలు ఏర్పాటు చేసి అదనపు నీటి అవసరాల నిమిత్తం 20 వేల లీటర్ల నీటి ట్యాంక్‌ ఏర్పాటు చేసామన్నారు. కాలనీలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అసంపూర్ణంగా శిధిలవస్థలో ఉన్న సామాజిక భవనాన్ని మంత్రి పరిశీలించారు.అసంపూర్ణంగా వున్న సిసి రోడ్లను, డ్రైనేజ్‌లను త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ కీముడు రమణమ్మ, ఎంపీపీ రామ ధర్మజ, మండల పార్టీ అధ్యక్షులు రాజారాం, మాడుగుల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సేనాపతి కొండలరావు, గ్రామ సర్పంచులు కరణం రాము, కరణం రాము, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️