సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా

సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా

ప్రజాశక్తి-కొత్తకోట:ఆదివాసీ గిరిజనులు జగనన్నకు చెబుదాం ఫిర్యాదులపై తక్షణమే జిల్లా జాయింట్‌ కలెక్టర్‌తో సమగ్రంగా విచారణ చేపట్టి, జగనన్న రీ సర్వేలో అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్‌పై (ఆర్‌ఐ) సమగ్రమైన దర్యాప్తు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో గురువారం రావికమతం మండల తహసిల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యలు కె.గోవిందరావు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పాంగి చంద్రయ్య తదితరులు మాట్లాడుతూ, చీమలపాడు శివారు అజరుపురం గ్రామానికి చెందిన 11 మంది ఆదివాసీ చిన్నారుల జన్మదిన ధ్రువ పత్రాలు మంజూరు కోసం గ్రామ సచివాలయంలో దరఖాస్తులు చేయగా, నేటికీ ఆరు నెలలు గడుస్తూన్నా అధికారుల నిర్లక్ష్యంతో ధ్రువ పత్రాల మంజూరు కాలేదన్నారు. జగనన్న రీ సర్వేలో బుడ్డిబంద, కవ్వుకుంట ఆదివాసి గిరిజన భూములను గిరిజనేతరులకు అప్పగించిన డిఫారం పట్టాలను తక్షణమే రద్దు చేసి. తక్షణమే గిరిజనులకు పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. డి పారం భూముల అన్యాక్రాంతానికి కారుకులైన ఆర్‌ ఐ పై చర్యలు చేపట్టాలన్నారు. జగన్నకు చెబుదాం పిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్‌ 20న మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలు సమస్య లపై దరఖాస్తులు ఇవ్వగా నేటికి పరిష్కారానికి నోచుకోలేదని దుయ్యబట్టారు. మండలంలో సుమారు 18 గ్రామాలల్లో అటవీ భూముల సాగుదారులకు పట్టాల మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తులు చేస్తే నేటికీ అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టలేదని తెలిపారు. నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌ అధికారి( ఆర్‌డివో )రెండు పర్యాయాలు వీటికి సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించినా ఫలితం లేదన్నారు. ఈ సమస్యలపై జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ తో సమగ్ర విచారణ చేయాలని గోవిందరావు, చంద్రయ్య డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గేమిల రాజు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️