తాగునీటి ఎద్దడి రానీయొద్దు

మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.గౌతమి

       అనంతపురం : జిల్లాలో వేసవికాలంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని కలెక్టర్‌ ఎం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో వేసవిలో తాగునీటి సరఫరా కోసం కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి నివారణకు క్షేత్రస్థాయి ప్రణాళికలు రూపొందించాలన్నారు. తాగునీటి సరఫరా కోసం అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని, అడిగిన వెంటనే నిధులు ఇస్తామన్నారు. ఎక్కడా నీటి ఎద్దడి ఎదురుకాకుండా చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో వెంటనే పూర్తి చేయాలని సూచించారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే మండలాల పరిధిలో అవసరమైన చోట చేతిపంపుల మరమ్మతులు చేపట్టాలన్నారు. తాగునీటి సమస్యల కోసం జిల్లా కేంద్రంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలన్నారు. కంట్రోల్‌ రూమ్‌కి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మున్సిపాలిటీలలో కూడా కంట్రోల్‌ రూమ్‌ లను ఏర్పాటు చేయాలన్నారు. నీటిని వథా చేయకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ‘సేవ్‌ వాటర్‌ క్యాంపెయిన్‌’ చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్‌ మేఘస్వరూప్‌, జిల్లా పరిషత్‌ సీఈవో వైఖోమ్‌ నిదియా దేవి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఇహషాన్‌ బాషా, డీపీవో ప్రభాకర్‌ రావు, ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సురేంద్ర, ఏపీఎస్పీడీసీఎల్‌ ఏడీ వివేకానందస్వామి, డ్వామా పీడీ వేణుగోపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️