భగ్గుమన్న కార్మిక,కర్షకలోకం..!

అనంతపురం బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు,కార్యకర్తలు

           అనంతపురం : బిజెపి అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై నిరసనాగ్రహం పెల్లుబికింది. కేంద్రం తీరుపై కార్మికులు, కర్షకలు భగ్గుమన్నారు. సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్‌ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వందల సంఖ్యలో కార్మికులు, రైతులు రోడ్లపైకి వచ్చి పెద్దపెట్టున నిరసన ప్రదర్శనలు చేశారు. చిన్నా, పెద్ద, ఉద్యోగి, నిరుద్యోగి, కార్మికుడు, కర్షకుడు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉద్యమబాట పట్టారు. హక్కుల సాధనే లక్ష్యంగా సమ్మె ముంగిట జనమంతా నిలిచారు. నిరసనలు, నినాదాలు, ర్యాలీలతో జిల్లా దద్దరిల్లింది. ప్రజలు, కార్మికులు, సంఘటితంగా సమ్మెలో పాల్గొని ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బిజెపి ప్రభుత్వానికి సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్‌ ద్వారా నిరసనను తెలియజేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్‌ జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. కార్మిక, ప్రజాసంఘాలతో పాటు వామపక్షాలు బంద్‌లో పాల్గొన్నాయి. ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మె జిల్లాలో విజయవంతం అయ్యింది. అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు, ఎఎఫ్‌టియున్యూ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో స్కీం వర్కర్లు, బిఎస్‌ఎన్‌ఎల్‌, తదితర ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పని చేసే కాంట్రాక్టు కార్మికులు అన్ని కార్యాలయాల నుంచి సమ్మెలో పాల్గొన్నారు. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేలా తీసుకొచ్చిన నల్లచట్టాల అమలుకు దొడ్డదారిన ప్రయత్నిస్తున్న బిజెపి ఆ విధానాలను విరమించుకోవాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను ఆపాలని నినాదాలు చేశారు.

➡️