మున్సిపల్‌ కార్మికులను మోసం చేయొద్దు 

Feb 6,2024 21:25

కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

        అనంతపురం  : మున్సిపల్‌ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తే మరో ఆందోళనకు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయని కార్మికులు హెచ్చరించారు. సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం నాడు అనంతపురం కలెక్టర్‌ కార్యాలయం వద్ద మున్సిపల్‌ కార్మికులు ధర్నా చేపట్టారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఏటీఎం నాగరాజు అధ్యక్షతన జరిగిన ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్‌.నాగేంద్ర కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మెను విరమించి నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం హామీలకు సంబంధించి జీవోలు జారీ చేయడంలో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తోందన్నారు. సమ్మె ముగింపు రోజున మూడు రోజుల్లో హామీలపై జీవోలు జారీ చేస్తామని గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌, అధికారులు హామీనిచ్చారని గుర్తు చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో పని చేస్తున్న 6 వేల మంది మహిళా కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ హామీ అమలు కాలేదన్నారు. క్లాప్‌ డ్రైవర్లకు చట్ట బద్ధమైన జీత భత్యాలు చెల్లింపులపై జనవరి నెలాఖరులో జాయింట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేస్తామని, ఇంతవరకు వేయలేదన్నారు. మినిట్స్‌ కాపీతో పాటు, సంక్రాంతి కానుక రూ.వెయ్యి, సమ్మె కాలపు వేతనం చెల్లింపునకు సంబంధించిన జీవోలు మాత్రమే జారీ చేశారని తెలిపారు. అందులోనూ ఎన్‌ఆఎంఆర్‌ కోవిడ్‌, మలేరియా, గార్బేజ్‌ స్థానిక అవసరాల నిమిత్తం కొత్తగా తీసుకున్న కార్మికులు, క్లాప్‌ డ్రైవర్లకు సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని జీవోలో పేర్కొనలేదన్నారు. దీంతో మున్సిపల్‌ అధికారులు వీరికి సమ్మెకాలపు వేతనాలు చెల్లించడానికి నిరాకరిస్తున్నారని తెలిపారు. తక్షణమే వీరికి కూడా వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్విరాన్‌మెంట్‌ కార్మికులకు రూ.21 వేలు, శానిటేషన్‌ డ్రైవర్‌లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ కార్మికులకు రూ.24,500 వేతనం, విలీన గ్రామ పంచాయతీ కార్మికులను మున్సిపల్‌ కార్మికులుగా గుర్తించి రూ.21 వేలు వేతనం ఇవ్వాలన్నారు. ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సమస్యలనూ పరిష్కరించాలన్నారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.75 వేలు, దహన సంస్కారాలకు రూ.20 వేలు, ఎక్స్‌గ్రేషియా సాధారణ మృతికి రూ.2 లక్షలు, ప్రమాద మృతులకు రూ.5 నుంచి రూ. 7 లక్షలకు పెంచాలన్నారు. జిపిఎఫ్‌ అకౌంట్‌లు ప్రారంభించాలన్నారు. క్లీన్‌ ఎన్విరాన్‌మెంట్‌ వర్కర్స్‌కు సంబంధించి సంక్షేమ పథకాలు అమలు తదితర జీవోలు వెంటనే జారీ చేయాలన్నారు. సమ్మె కాలపు హామీల అమలుపై స్పందింకుంటే మరోమారు సమ్మెలోకి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం డిఆర్‌ఒను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం నాయకులు మల్లికార్జున, సంజీవ రాయుడు, ఓబుళపతి, పోతులయ్య, రెగ్యులర్‌ ఉద్యోగుల సంఘం నాయకులు ముత్తురాజు, ఎమ్మార్పీఎస్‌ నాయకులు నల్లప్ప, సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ, అంజి, వన్నూరప్ప. జగదీష్‌, తిరుమలేష్‌, రాము, సూరి, ఎర్రిస్వామి, రాజా, జుబేర్‌, మంత్రి వరలక్ష్మి, వన్నూరుస్వామి పాల్గొన్నారు.

➡️