మరింత అప్రమత్తత అవసరం

కలెక్టరేట్లోని జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పరిశీలిస్తున్న ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు, కలెక్టర్‌

      అనంతపురం కలెక్టరేట్‌ : ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో విధుల్లో ఉన్న సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సాధారణ ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్‌ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సాధారణ ఎన్నికలు – 2024 పై వ్యయ పర్యవేక్షణ నోడల్‌ అధికారులు, ఎంసిఎంసి నోడల్‌ అధికారులతో కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నీనా నిగమ్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల వ్యయ పర్యవేక్షణ పక్కాగా చేపట్టాలన్నారు. ఎన్నికల పోలింగ్‌కు నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమాచారాన్ని చేరవేతలో ఎలాంటి ఆలస్యం ఉండరాదన్నారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయాలపై నిఘా ఉంచాలన్నారు. అభ్యర్థులు ఎక్కడైనా మద్యం, డబ్బు, ఇతర వస్తువులు పంపిణీ చేస్తుంటే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, ఎస్‌ఎస్‌టి, ఎఫ్‌ఎస్‌టి బృందాలు ఈ నాలుగు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యూపిఐ ద్వారా చిన్నచిన్న స్థాయిలో నగదు బదిలీ జరిగే అవకాశం ఉంటుందని, అలాంటి వాటిపై ప్రత్యేక దష్టి సారించాలని సూచించారు. కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలియజేశారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మద్యం, డబ్బు రవాణాపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. అనంతరం ప్రత్యేక వ్యయ పరిశీలకులు కలెక్టరేట్లోని జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను తనిఖీ చేశారు. వెబ్‌ క్యాస్టింగ్‌, క్వాలిటీ చెకింగ్‌, పోల్‌ డే ఏర్పాట్లు, ఎఫ్‌ఎస్టి ట్రాకింగ్‌ యూనిట్‌, తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్‌ సీఈవో వైఖోమ్‌ నిదియా, అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గం ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్‌ వి.షిండేతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల పరిశీలకులు పాల్గొన్నారు.

➡️