ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లో తాడిపత్రికి కూచిపూడి కళాకారిణిలు

ప్రతిభ చాటిన కూచిపూడి కళాకారిణులను అభినందిస్తున్న కలెక్టర్‌

         అనంతపురం : తాడిపత్రికి చెందిన కూచిపూడి కళాకారిణిలు అత్యంత ప్రతిభ చాటి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో వారి పేర్లు నమోదు చేసుకున్నారు. తాడిపత్రి పట్టణంలోని వందన డాన్స్‌ అకాడమీకి చెందిన కూచిపూడి కళాకారిణిలైన సాయి మైత్రి, జ్యోషిత, వర్షిని, నవ్య, సాహిత్య, నిహారికలు ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌ వద్ద మైనస్‌-2 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూచిపూడి డాన్స్‌ చేసి ఇండియా బుక్‌ఆఫ్‌ రికార్డులో పేరు సొంతం చేసుకున్నారు. అత్యంత ప్రతిభ చాటిన ఈ విద్యార్థులను అనంతపురం కలెక్టర్‌ డా||వి.వినోద్‌కుమార్‌ అభినందించారు. శనివారం నాడు కలెక్టర్‌ ఛాంబర్లో తనను కలిసిన ఆరుగురు కూచిపూడి కళాకారిణులకు జ్ఞాపికలు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కూచిపూడి కళలో నిష్ణాతులైన ఆరుగురు విద్యార్థినీలు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు దక్కించుకోవడం అభినందనీయం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నమోదు చేసి, ఇలాంటి ఘనతలను మరిన్ని సాధించాలని ఆకాంక్షించారు. వందన డాన్స్‌ అకాడమీకి చెందిన కూచిపూడి గురువు వందన భర్త ప్రవీణ్‌ మాట్లాడుతూ మే 13న తాడిపత్రి వందన డాన్స్‌ అకాడమీకి చెందిన కూచిపూడి కళాకారిణులు సాయి మైత్రి, జ్యోషిత, వర్షిని, నవ్య, సాహిత్య, నిహారికలు ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని కేదార్‌ నాథ్‌ ఆలయం వద్ద మైనస్‌-2 డిగ్రీల చలిలో ఉదయం 7 గంటల నుంచి 8:30 గంటల వరకు గంటన్నర పాటు కూచిపూడి నత్యాన్ని ప్రదర్శించారన్నారు. అంతకుముందు రోజు 25 కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ ద్వారా ప్రయాణం చేసి కేదార్‌ నాథ్‌ ఆలయం వద్దకు 19 గంటల వ్యవధిలో చేరుకున్నారని చెప్పారు. కేదార్నాథ్‌ ఆలయం వద్ద మైనస్‌ 2 డిగ్రీల చలిలో కూచిపూడి నత్యం ప్రదర్శించడంతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు దక్కిందన్నారు. భవిష్యత్తులో కైలాస పర్వతం (మౌంట్‌ కైలాస్‌) వద్ద కూచిపూడి నత్యాన్ని ప్రదర్శించేందుకు తాము సన్నద్ధం అవుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీవో షఫీ తదితరులు పాల్గొన్నారు.

➡️