తస్మాత్ జాగ్రత్త ఓటర్ల ఏప్రిల్ ఫూల్ కావద్దు

Apr 1,2024 12:27 #Anantapuram District

సీపీఎం నాయకులు ఓ నల్లప్ప

ప్రజాశక్తి-నార్పల : ఏప్రిల్ ఫూల్ చేయడానికి రాజకీయ నాటకాలు బయలు దేరాయని ఓటర్లు అప్రమత్తంగా వ్యవహరించి ఏప్రిల్ ఫూల్ కావద్దని సిపిఎం నాయకులు నల్లప్ప పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ఏప్రిల్ ఒకటి వస్తే ఫూల్ చేస్తారనే నానుడి ఉండేది. అయితే ఈ సారి ప్రత్యేకత వుంది.  గతంలో ఎన్నడూ లేని విధంగా ఊసరవెల్లి రాజకీయ నాయకులు తెర వెనుక నుండి నడిపిస్తున్న వారు ఏప్రిల్ ఫూల్ నిజంగా జనాన్ని చేయడానికి బయలు దేరారు. ఇంతకాలం ఎవరైతే ఎన్నికల్లో నిలబడతారో వారే ప్రత్యక్షంగా రాజకీయాలు చేసేవారు. కొన్ని విలువల కోసం పని చేశారు. ఇప్పుడు అలా కాదు, అంతా దోపిడీకి వృత్తిగా రాజకీయాలు మారాయి. మామూలు వ్యవసాయం చేయడం, కూలిపని చేయడం, పరిశ్రమ, విద్యాలయాలు పెట్టి సంపాదన కు ఎక్కువ కాలం పడుతుంది. అందుకే తక్కువ కాలంలో కోట్లు సంపాదన, తన వారసులు తిని అరగనంత పోగు చేయాలంటే రాజకీయాలకు మించిన వృత్తి మరొకటి లేదు. రాజకీయాల్లో పెట్టుబడి పెట్టి దోచుకోవడం సులభమైన పని. ఈ రాజకీయాలు కూడా అషామాషిగా ఉండవు. తమకు సంబంధం లేని రిజర్వేషన్ స్థానాల్లో తమ బంధువులను, స్నేహితులను, తన అనుయాయులకు ఎమ్మెల్యే లు చేయడం, చేయించేందుకు పెట్టుబడి సాధనగా రాజకీయాలను దిగదార్చుతున్నారు. ఈ కాలంలో జరిగిన సంఘటనలు చూస్తే నిజమనిపిస్తున్నది. సామాజిక న్యాయం అనే ముద్దు పేరుతో పెత్తందారీ రాజకీయాలు చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు పెత్తందారీ, డబ్బు, కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజలను విభజించి పాలించే కుట్రలు  పన్నుతున్నారు. ప్రజాస్వామ్యం కు తెర వెనుక రాజకీయాలు ప్రజలకు తీవ్ర నష్టం చేస్తాయి. రిజర్వేషన్ స్థాయిని రబ్బరు స్టాంపు రాజకీయాలు దిగజార్చుతున్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లను ఏప్రిల్ ఫూల్ చేసే ఆలోచనలో కుయుక్తులు వేస్తున్నారు. అందుకే ఒక పెద్దాయన ఏమన్నారంటే ఏ మాటల వెనుక ఎవరి ప్రయోజనాలు (పాలకులకా, ప్రజలకా) ఉన్నాయో తెలుసుకోవాలి, తెలుకోకపోతే మోసపోతారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీలో ఉన్న వ్యక్తులు, శక్తులు తెర వెనుక ఎవరు, ముందు ఎవరు, వారి మాటలు, ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరు పెట్టుబడి, ఎందుకు పెట్టుతున్నారు. ఏమి ఆశించి చేస్తున్నారు. గెలిచిన తర్వాత ఎవరికి సేవ చేస్తారు. చూసి విజ్ఞతతో ఆలోచించండి. మంచిని, ప్రజలకు అందుబాటులో ఉంటూ, స్వతంత్రంగా పనిచేసే వారు, కీలుబొమ్మ రాజకీయాలు కాకుండా, రబ్బరు స్టాంపు రాజకీయాలు కాకుండా, నియోజకవర్గం పట్ల, సమస్యల పట్ల అవగాహన ఉన్నవారిని, ప్రశ్నించే తత్వం ఉన్న వారిని గెలిపించుకునేందుకు ఓటర్ గా ప్రయత్నం చేస్తేనే మనుగడ ఉంటుంది. ఏప్రిల్ ఫూల్ నాటకాలకు అవకాశం ఇవ్వద్దని ఓటర్లను కోరారు.

➡️