అంగన్వాడీల సమ్మె పై అక్కసు తగదు : సిపిఎం

Dec 14,2023 15:30 #Dharna, #vijayanagaram
  • అడ్డదారుల్లో కేంద్రాలు తెరిపించేందుకు యత్నం
  • ఉత్సాహంగా దీక్షల్లో పాల్గొంటున్న అంగన్వాడీలు

ప్రజాశక్తి – జామి(విజయనగరం) : అంగన్వాడీ లు చేపడుతున్న నిరవధిక సమ్మె పై ప్రభుత్వం పెద్దలు, అధికారులు అక్కసు వెళ్లగక్కడం ప్రభుత్వం దిగజారుడు తనాన్ని తెలియజేస్తుందని, అంగన్వాడీ కార్యకర్తలు ప్రజాస్వామ్య పద్దతిలో సమ్మె చెపుతుంటే, అడ్డదారుల్లో కేంద్రాలు తెరవాలని ప్రభుత్వం చూస్తుందని, ఇది సరియైన పద్దతి కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం అంగన్వాడీ ల సమ్మెకు సంఘీభావాన్ని తెలియపరచి, సమ్మె విచ్ఛిన్నం చేయాలని చూస్తే, మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా రెండో రోజు వర్కర్లు, హెల్పర్లు పెద్ద ఎత్తున ఎమ్మెర్వో ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు.ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల అమల కోసం గత నాలుగేళ్లుగా శాంతియుతంగా అంగన్వాడీ కార్యకర్తలు
నిరసన తెలియజేశారని, పలుదపాలు ప్రభుత్వంతో చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు సిద్ధం కావాల్సి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తెలంగాణ కంటే అదనంగా జీతం, గ్రాట్యూటీ,రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్,మినీ సెంటర్లను మెయిన్ సెంట్రల్ గా మార్చడం తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో నిరవధికంగా సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.మాతా,శిశు సంరక్షణ కోసం గర్భిణీలకు, బాలింతలకు,పిల్లలకు సర్వీస్ అందిస్తున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడం పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సి ఐ టి యు ప్రధాన కార్యదర్శి కే.సురేష్, గాడి అప్పారావు, అంగన్వాడీ యూనియన్ నాయకులు, ఆర్.వెంకటలక్ష్మి,బి.కనకమహాలక్ష్మి, ఆర్.రామలక్ష్మి,ఆదిలక్ష్మి, పి. విష్షుణమ్మ,ఎల్.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

తాళాలు బద్దలు కొట్టి కేంద్రాలు తెరవండి : ఎంపీడీఓ సతీష్

తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు చేపడుతున్న సమ్మె లో బాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీడీఓ సతీష్ మండలంలోని వెల్ఫేర్ సిబ్బంది, మహిళా పోలీసులకు సమావేశం నిర్వహించారు. పోలీసుల సహకారంతో కేంద్రాలు తాళాలు తీసుకుని కేంద్రాలు తెరవాలని ఆదేశించారు. తాళాలు ఇవ్వని యెడల ఉన్నవాటిని పగల కొట్టి కేంద్రాలు తెరవాలని హిక్కుం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలపై సూపర్వైజర్లు, ప్రాజెక్ట్ అధికారులు బెదిరింపులకు తెగబడుతున్నారు. ఇదే నిర్భంధం కొనసాగితే పోరాటం ఉధృతం చేస్తామని అంగన్వాడీ హెచ్చరిస్తున్నారు.

➡️