తుఫాన్‌పట్ల అప్రమత్తంగా ఉండాలి

Dec 4,2023 23:49

– రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలవాలి
– ఎమ్మెల్యే ఏలూరి ఏలూరి సాంబశివరావు పర్యటన
ప్రజాశక్తి – పర్చూరు
మిచౌంగ్ తుపాను పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సూచించారు. నియోజకవర్గంలో ఆయన సోమవారం విస్తృతంగా పర్యటించారు. పలువురు రైతులతో మాట్లాడారు. పంటల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మిచౌంగ్ తుపాను బాపట్ల సమీపంలో మంగళవారం తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుందని, ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని అన్నారు. ఈ తుఫాను గంటకు 110కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. తుఫాను ప్రభావంతో పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా వ్యాప్తంగా శనగ, మిరప, పత్తి, వైట్ బర్లి పంటలు దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించాలని కోరారు. అధిక శాతం నీరు కలుషితమయ్యే అవకాశం ఉందని అన్నారు. త్రాగునీరు, శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.
ఏలూరి విస్తృత పర్యటన
యద్దనపూడి మండలం చింతపల్లిపాడు మహేష్ నివాసంలో అయ్యప్ప స్వామి ఇరుముడి పూజల్లో పాల్గొన్నారు. పర్చూరు నెహ్రూ కాలనీకి చెందిన సయ్యద్ సుభాని మరణించగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నరాలశెట్టి కృష్ణ సతీమణి దుర్గమ్మ చిత్రపటానికి, స్థానిక అంబేద్కర్ కాలనీ చెందిన ఆర్టీసీ డ్రైవర్ దేవరపల్లి నల్లయ్య మృతదేహానికి నివాళులర్పించారు. గోరంట్లవారిపాలెం గ్రామానికి చెందిన తొలి సర్పంచ్ సురాభత్తిని రామయ్య, టిడిపి గ్రామ అధ్యక్షులు సింగు శ్రీనివాసరావును పరామర్శించారు.

➡️