క్లోరినేషన్ క్రమం తప్పకుండా చేయాలి : పిన్ని బోయినవారిపాలెంను సందర్శించిన డిపిఓ

Mar 29,2024 00:16 ##dpo #Bapatla #medicalcamp

ప్రజాశక్తి – బాపట్ల
తూర్పు పిన్ని బోయినవారిపాలెం గ్రామంలో మంచి నీటి సరఫరా ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా అయ్యే నీటి కుళాయిలను పరిశీలించి క్లోరినేషన్ క్రమం తప్పకుండా చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వి రవికుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం గ్రామాన్ని ఆయన సందర్శించారు. ప్రజలకు మరికొన్ని రోజుల పాటు ట్యాంకుల ద్వారా సురక్షితమైన మంచినీటిని అందించాలని చెప్పారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. గ్రామంలో కొనసాగుతున్న వైద్య శిబిరాన్ని సందర్శించారు. విరేచనాలతో బాధపడుతున్న రోగులకు అందించే సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. అవసరమైన బాధితులకు సెలైన్ ఎక్కించేందుకు బెడ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని పంచాయతీ, సచివాలయ, వైద్య, ఆరోగ్య సిబ్బంది సంయుక్తంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. వైద్య శిబిరాన్ని నిరంతరం కొనసాగించాలని అన్నారు. ఆయనతో పాటు ఇఓ పిఆర్ అండ్ ఆర్‌డి పులి శరత్ బాబు, పంచాయతీ కార్యదర్శి స్టాలిన్ బాబు పాల్గొన్నారు.

➡️