ఎన్నిక ప్రశాంతం

ఎన్నిక ప్రశాంతం

ఎన్నిక ప్రశాంతంప్రజాశక్తి- తిరుపతి సోమవారం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. తిరుపతి అసెంబ్లీ పరిధిలో సోమవారం రాత్రి 8 గంటల వరకు 1,85,528 ఓట్లతో 61.33 శాతం పోలింగ్‌ నమోదవగా, చంద్రగిరి నియోజకవర్గంలో 2,38,588 ఓట్లు పోలై 75.70 శాతం ఓటింగ్‌ నమోదవడం గమనార్హం. తిరుపతి, చంద్రగిరి నియోజవర్గాల్లో అధికార పార్టీ నేతల దౌర్జన్యం, దొంగ ఓట్ల పోలింగ్‌కు తీవ్రయత్నాలు అడుగడుగునా చోటుచేసుకున్నాయి. పలు చోట్ల ఘర్షణలు, స్వల్పలాఠీచార్జి చోటుచేసుకోక తప్పలేదు. ఉదయం 6 గంటల నుంచీ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరినా మాక్‌పోలింగ్‌ అంటూ దాదాపు 45 నిమిషాలు నుంచి గంట పాటు సమయం వృధాగా గడిచిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తిరుపతి రూరల్‌ మంగళం, సప్తగిరినగర్‌, రణధీర్‌పురం, తిరుమలనగర్‌, శెట్టిపల్లిలో ఇలా దాదాపు 7.15 వరకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమే కాలేదు. ఇక రణధీర్‌పురం, మంగళం, తిరుచానూరు, దామినేడు, పాడిపేటతో పాటు తిరుపతి నగరంలోని తిమ్మినాయుడుపాళెం, టీపీ ఏరియా, నగరంలోని బూత్‌నెంబర్లు 89, 131, 132, 133, 151, 193, 215, 216 ఇవిఎంలు మొరాయించాయి. తిరుపతిలోని సెవెన్స్‌ హిల్స్‌ హైస్కూల్‌, బూత్‌ నెంబరు 117, 118ల వద్ద ఇవిఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ బూత్‌ వద్ద ఏర్పాటు చేసిన సిసి కెమెరా ప్లగ్‌ కనెక్షన్‌ ఊడిపోవడంతో పలువరు ఓటర్లకు విద్యుత్‌ షాక్‌ కొట్టింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్లు , ఇతర మౌళిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సర్వర్ల మొరాయింపుతో దాదాపు ఉదయం 10-11 గంటలు అవుతున్నా ఓటర్లు గంటలు తరబడి బారులు తీరాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో టిపి ఏరియాలో పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 89 ప్రసాద్‌, సుబ్బారెడ్డి అనే వృద్దులు పోలింగ్‌ అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఓటింగ్‌ వేయకుండానే వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుపతి నగరంలోని లిటిల్‌ ఏంజెల్స్‌ స్కూల్‌ వద్ద దాదాపు 5 గంటల పాటు ఎండలోనే వేచిఉండాల్సి వచ్చింది. సత్యనారాయణ పురం సర్కిల్లో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ ఏర్పాటుచేసిన వైసిపి బ్యానర్‌పై సోషల్‌మీడియాలో తీవ్ర దుమారం రేకెత్తడంతో వాటిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్‌ , రిటర్నింగ్‌ అధికారి చర్యలు తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఎస్టీవీ నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తనసెల్‌ఫోన్‌తో పోలింగ్‌ కేంద్రంలోనికి వెళ్లి వైసిపికి ఓటు వేస్తున్నట్లు తీసిన వీడియా తీవ్ర వివాదంగా మారింది. అలాగే జగన్మాత చర్చి పోలింగ్‌ కేంద్రం వద్ద దొంగోట్లు వేసేందుకు వచ్చిన 5 మందిని ఎన్‌డిఎ కూటమి నేతలు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలింగ్‌ కేంద్రం 163,164లో కార్పొరేటర్‌ అనీష్‌ రాయల్‌ హల్చల్‌ చేస్తూ పెద్దఎత్తున దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నం చేశారు. రాయల్‌నగర్‌, సీకాం కాలేజీ బూత్‌ వద్ద మరో కార్పరేటర్‌ శేఖర్‌రెడ్డి కూటమి నేతలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకుని అక్కడకు వెళ్లిన జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తనయుడిపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వ్యక్తిగత సహాయకుడు రామకృష్ణను బయటకు నెట్టేశారు. అడ్డుకున్న సుగుణమ్మపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు నగరంలోని పలుబూత్‌లను పర్యటిస్తూ నాలుగు ప్రాంతాల్లో దొంగ ఓట్లు వేస్తున్న వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్‌ కాలేజీ వద్ద పోలీసుల సహకారంతో దొంగోట్లు వేయిస్తున్నారన్న సమాచారంతో టిడిపి పార్లమెంటు అధ్యక్షులు నరసింహయాదవ్‌, కిరణ్‌రాయల్‌తో ఘర్షణకు దిగారు. దొడ్డాపురం పోలింగ్‌ బూత్‌లో దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన ఇద్దరు యువకుల్ని సిఆర్‌పిఎఫ్‌ పోలీసులు చితకబాదడంతో సృహతప్పి పడిపోయాడు. తిరుపతి రూరల్‌ మంగళం, సప్తగిరినగర్‌, ఆర్‌సి పురం, రావిళ్లవారి పల్లి, బ్రాహ్మణకాలువ, తిరుచానూరు, పాడిపేట, యోగిమల్లవరం, దామినేడు ప్రాంతాల్లో అధికార వైసిపి, టిడిపి నేతల మధ్య ఘర్షణ వాతావారం నెలకొంది. దీంతో ఇరు వర్గాలనూ చెదరగొట్టడానికి పోలీసులు స్వల్పలాఠీచార్జి చేశారు. తిరుచానూరు జెడ్పీ హైస్కూల్‌ , మంగళం ప్రాంతంలో ఆబ్‌సెంట్‌, షిప్ట్‌, డెత్‌ ఓట్లపై దుమారం రేగింది. పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా అక్కడికి చేరుకుని వైసిపి నేతలతో పాటు ఎన్నికల అధికారులను నిలదీసింది. దీనిపై ఎలక్షన్‌ కమిషనర్‌, ఆర్‌ఓకు ఫిర్యాదు చేసింది.

➡️