ఉద్యమాలతోనే విద్యారంగానికి రక్షణ

Nov 28,2023 23:41

ప్రజాశక్తి – పంగులూరు
ప్రభుత్వం ఒక పథకం ప్రకారం జీవో నెంబర్ 117తీసుకొచ్చి ఉపాధ్యాయులను కుదించి, పాఠశాలలను మూసివేయాలనే ప్రయత్నంలో ఉందని యుటిఎఫ్‌ నేతలు పేర్కొన్నారు. ఇదే విధానం కొనసాగితే విద్యావ్యవస్థ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ జీఒకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులంతా ఉద్యమించాలని కోరారు. ఉద్యమాల ద్వారానే ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టి, పాఠశాలలను నిలుపుకుంటామని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శిలు యు చెంచయ్య, పి హరిబాబు అన్నారు. స్థానిక జెడ్‌పి ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన యుటిఎఫ్‌ మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో విద్యారంగాన్ని నీరుగారుస్తున్నాయని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా యుటిఎఫ్‌ నిరంతరం పోరాడుతుందని అన్నారు. ఈ పోరాటానికి ఉపాధ్యాయ వర్గాలతో పాటు, ప్రజలు కూడా సహకరించాలని కోరారు. సిపిఎస్, జిపిఏస్ రద్దుచేసి ఓపిఎస్ పునరుద్ధరించాలని, పెండింగులో ఉన్న పిఆర్సి, డిఏ బకాయిలను మంజూరు చేయాలని, అమ్మ ఒడి ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తింపజేయాలని, తెలుగు మీడియంను రద్దు చేయడం విరమించుకోవాలని, సమాంతర మీడియంలను ఉంచాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు పిఎస్, హెచ్ఎం పోస్టును కేటాయించాలని, హెల్త్ కార్డు ద్వారా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సమావేశంలో తీర్మానించారు.
యుటిఎఫ్ మండల నూతన కార్యవర్గం
యుటిఎఫ్ పంగులూరు మండల నూతన కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా టివీ నరసింహారావు, బి సుబ్బారావు, సహాధ్యక్షులుగా కె సోమశేఖర్, ఐవీ రమణ, కోశాధికారిగా ఎస్‌కె ఫిరోజ్ ఎన్నికయ్యారు. ఎన్నికలకు పరిశీలకులుగా పూనాటి హరిబాబు, యు చెంచయ్యలు వ్యవహరించారు.

➡️