తెలుగు కవయిత్రులకు ఘన నివాళి

Dec 25,2023 23:57

ప్రజాశక్తి – బాపట్ల రూరల్
సాహితీ రుద్రమ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ బాపట్ల వాస్తవ్యులు కావటం, అభినవ తిక్కన తుమ్మల సీతారామమూర్తి బాపట్ల సమీప గ్రామమైన అప్పికట్ల వాస్తవ్యులు కావటం గర్వ కారణమని ప్రజాకవి, వైద్య విద్వాన్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ కొనియాడారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో తుమ్మల సీతా రామమూర్తి 122వ జయంతి, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ 106వ జయంతి సభకు ఆయన అధ్యక్షత వహించారు. తెలుగు స్త్రీవాద కవయిత్రులలో ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ప్రముఖులని అన్నారు. స్త్రీవాదంతో కూడిన స్త్రీలే రాసిన కథలతో కథామందారం అనే తొలి కథా సంకలనాన్ని ప్రచురించారని అన్నారు. సభకు విచ్చేసిన రావూరి నరసింహ వర్మ మాట్లాడుతూ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ కళా ప్రపూర్ణ, డాక్టర్, ఆంధ్ర సరస్వతి, ఆంధ్ర విదుషీ కుమారి తదితర బిరుదులతో సన్మానింపబడ్డారని అన్నారు. ఆంధ్ర కవయిత్రులు, కన్యకా సుప్రభాతం, హంస విజయం, జాతిపిత, నా తెలుగు మాంచాల, సాహితీ రుద్రమ వంటి గ్రంథాలు రచించారని అన్నారు. మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ తెలుగులెంక, అభినవ తిక్కనగా ప్రసిద్ధి చెందిన తుమ్మల సీతారామమూర్తి బాపట్ల జిల్లాలోని కావూరు గ్రామంలో జన్మించారని, అప్పికట్లలో స్థిరపడ్డారని అన్నారు. మహాత్మా గాంధీ ఆస్థాన కవిగా ప్రశంసించబడ్డారని గుర్తు చేశారు. గాంధీ గానం, రాష్ట్ర గానం, ఉదయ గానం, ధర్మ జ్యోతి, పెదకాపు, ఆత్మార్పణం, భజ గోవిందం వంటి గ్రంథాలు రచించారని అన్నారు. సభలో ఆదం షఫీ, ఎన్ కృష్ణ, ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, పువ్వాడ వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు.

➡️