రేపు పెనుమాకలో సిఎం పర్యటన

Jun 30,2024 00:29

ప్రజాశక్తి-గుంటూరు : తాడేపల్లి మండలం పెనుమాకలో సోమవారం ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న నేపథ్యంలో అధికారులందరు సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో కలక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరంలో శనివారం సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పెనుమాకలో పింఛన్ల పంపిణీ అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు, ప్రజలతో ముఖాముఖీ మాట్లాడతారన్నారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా పకడ్భందీ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని, పారిశుధ్య ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. పోలీసు శాఖాధికారులు బందోబస్తు ఏర్పాట్లు, ఆర్‌అండ్‌బి అధికారులు బారీకేడింగ్‌ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. విద్యుత్‌ను నిరంతరం సరఫరా చేయాలన్నారు. సమావేశంలో జెసి రాజకుమారి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ ప్రఖార్‌జైన్‌, డిఆర్‌ఓ పి.రోజా, ఆర్డీవో పి.శ్రీఖర్‌, డిఆర్‌డిఎ పీడీ హరిహరనాథ్‌, సిపిఓ శేషశ్రీ, డిఈఓ శైలజ, డిఎస్‌ఓ కోమలి పద్మ పాల్గొన్నారు.

➡️