పేదలందరికీ సొంత ఇల్లు నిర్మిస్తా : సిపిఎం కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి డి గౌస్‌ దేశాయి

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : కర్నూల్‌ నగరంలోని అర్హులైన పేదలందరికీ సొంత ఇంటిని నిర్మించి ఇస్తానని, మౌలిక సదుపాయాలతో కాలనీలను అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్‌ సిపిఐ ఆమ్‌ఆద్మీ ఉమ్మడి పార్టీలు బలపరిచిన సిపిఎం కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి డి.గౌస్‌ దేశాయి అన్నారు. ఆదివారం ఆయన నగరంలోని నండూరి ప్రసాదరావు నగర్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి పూలే అంబేద్కర్‌ నగర్‌, సమత నగర్‌, ఎద్దుల ఈశ్వర్‌ రెడ్డి నగర్‌, ఫోర్త్‌ క్లాస్‌ ఎంప్లాయిస్‌ కాలనీ లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. కాలనీలో ప్రజలు ఆయనకు అడుగున పూలమాలతో, హారతులతో స్వాగతం పలికారు. ప్రజానాట్యమండలి కళాకారులు డప్పులు, దరువులతో హోరెత్తిస్తూ ప్రచారానికి ముందు భాగాన ఉండి కార్యకర్తల్లో హుషారు నింపారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి తిరుగుతూ తనకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … గత 15 ఏళ్లుగా పేదలు నివసించే కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకుండా పోయాయన్నారు. పూలే అంబేద్కర్‌ కాలనీలో రోడ్లు, విద్యుత్తు దీపాలు మురికి కాలువలు ఏర్పాటు చేయలేదన్నారు. పేదల చిమ్మ చీకట్లోనే మురికి కూపాల మధ్య జీవనం సాగించాల్సిన దుస్థితినీ ప్రభుత్వం కల్పించిందన్నారు. పేదలంటే ప్రభుత్వానికి అంత చులకనా అని ప్రశ్నించారు. నేటికీ లక్షలాదిమందికి ఇళ్ల స్థలాలు ఇల్లు లేవని, ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో ఆర్భాటం ఆడంబరం చేసింది తప్ప కాలనీలో నిర్మాణం ఏమాత్రం చేపట్టలేదు అన్నారు. రెండు పర్యాయాలు ప్రజలు అధికారం ఇస్తే వైసిపి నాయకులు పేదలకు ఏం ఒరగబెట్టారో చెప్పాలన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్గా ఉన్న 19వ వార్డులోనే ఇలాంటి పరిస్థితి ఉంటే సాధారణ వార్డుల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో చెప్పక్కర్లేదన్నారు. సుద్దవాగు రక్షణ గోడ నిర్మాణానికి రూ.వందల కోట్లు నాటి సిపిఎం ఎమ్మెల్యే గఫూర్‌ నిధులను సమీకరిస్తే వాటిని ఖర్చు చేయలేని చేతగాని స్థితిలో వైసిపి నాయకులు అధికారులు ఉన్నారన్నారు ఆ నిధులు ఏమయ్యాయో కూడా సమాధానం వారి నుండి లేదన్నారు. రక్షణ కూడా లేకపోవడంతో పేదల ఇళ్లకు వరదల ద్వారా ప్రమాదం పొంచి ఉందన్నారు. కాలనీలో తాగునీటికి ప్రజలు అష్ట కష్టాలు పడాల్సి వస్తుందన్నారు. అర్ధరాత్రి పూట తాగునీటి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూడాల్సి వస్తుందన్నారు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. తనను ఓటిసి గెలిపిస్తే పేద ప్రజలకు సొంత ఇల్లు, రోడ్లు మురుగు కాలువలు వీధి దీపాలు తోపాటు సకాలంలో ప్రతిరోజు మంచినీటిని అందించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అన్నివేళలా పేద ప్రజలకు అండగా ఉండేది కేవలం ఎర్రజెండా మాత్రమేనని అన్నారు. ఈ ఎన్నికల్లో నిత్యం ప్రజల పక్షాన పోరాడే సిపిఎం నుంచి కాంగ్రెస్‌ సిపిఐ ఆమ్‌ ఆద్మీ పార్టీలు బలపడుతున్న ఉమ్మడి అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీఎస్‌ రాధాకఅష్ణ, జిల్లా కమిటీ సభ్యులు ఆనంద్‌ బాబు, అరుణ, జోన్‌ కార్యదర్శి విజరు, సుభాన్‌, నరసింహులు, సిపిఐ నగర కార్యదర్శి రామకఅష్ణారెడ్డి, సహాయ కార్యదర్శి చంద్రశేఖర్‌, సిఐటియు నగర కార్యదర్శి రాధాకఅష్ణ, మాలిక్‌, లక్ష్మణ్‌, సిపిఐ శాఖ కార్యదర్శి మల్లేష్‌ ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు కుమార్‌, సిపిఎం నాయకులు క్రిష్ణ, రత్నమ్మ, రషీద, శేఖర్‌, హనుమంతు, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

➡️