స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు సిపిఎం గెలుపు అవసరం

సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గునాయుడు

రైల్వే క్వార్టర్స్‌లో వాకర్స్‌తో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గునాయుడు

ప్రజాశక్తి -గాజువాక: స్టీల్‌ప్లాంట్‌ రక్షణకు గాజువాక ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని, ఇండియా ఫోరం బలపరిచిన సిపిఎం, గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి ఎం జగ్గునాయుడు పిలుపునిచ్చారు. శనివారం వడ్లపూడి రైల్వేక్వార్టర్స్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా వాకర్స్‌తో మాట్లాడారు.విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటైన తర్వాతే గాజువాక అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, అలాంటి స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుకు అమ్మేయాలని కేంద్రంలోని బిజెపి కుట్ర చేస్తోందన్నారు. బిజెపితో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుని టిడిపి, జనసేనలు, పరోక్షంగా అన్ని విధానాలు, నిర్ణయాలకు సహకరిస్తూ పరోక్షంగా వైసిపిలు రాష్ట్రం, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాయన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు జరుగుతున్న ఉద్యమాల్లో జెఎసి చైర్మన్‌గా తాను అన్నింటా పాల్గొన్నానని, ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు కార్పొరేటీకరణపై మరో అ డుగు ముందుకు వేయకుండా అడ్డుకోవాలంటే చట్టసభల్లో దీనిపై తీవ్రంగా ప్రతిఘటించేందుకు, పోరాడేందుకు ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణతోపాటు వడ్లపూడి, శ్రీనగర్‌ పరిసర ప్రాంతాల వాసులు అదానీ గంగవరం పోర్టు కాలుష్యంతో పడుతున్న ఇబ్బందులపైనా, విశాఖ డెయిరీ కాలుష్యంతో సతమతమౌతున్న 14 గ్రామాల సమస్యల పరిష్కారానికి ఈ ప్రాంత ప్రతినిధిగా చట్టసభల్లో ప్రశ్నించేందుకు తనను ఎమ్మెల్యేను చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్ను విధింపు, నూతన ఆస్తి పన్నుపై ఈ ప్రాంత సిపిఎం కార్పొరేటర్‌గా డాక్టర్‌ బి.గంగారావు ఇప్పటికే పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. గాజువాక ట్రాఫిక్‌ సమస్య, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఫ్లైఓవర్‌ నిర్మాణం, పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇతరత్రా సమస్యల పరిష్కారానికి ఉద్యమపార్టీ తరపున పోటీలో ఉన్న తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఎస్‌వికె.పరశురామ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో వార్వా, నివాస్‌ నాయకులు త్రినాధస్వామి, వాకర్స్‌ పాల్గొన్నారు.జగ్గునాయుడు గెలుపును కాంక్షిస్తూ బైక్‌ ర్యాలీఇండియా ఫోరం బలపరిచిన గాజువాక సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడు విజయాన్ని కాంక్షిస్తూ శనివారం గాజువాకలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నాతయ్యపాలెంలో బైక్‌ర్యాలీని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి పద్మ ప్రారంభించగా, మింథి, అప్పన్నకాలనీ, జోగవానిపాలెం, పాత గాజువాక, చిట్టి నాయుడు కాలనీ, దశమకొండ ప్రాంతాల మీదుగా సాగింది. సిపిఎం జెండాలు, టోపీలను పెట్టుకుని పెద్దసంఖ్యలో సిపిఎం, ఇండియాబ్లాక్‌ కేడర్‌, అభిమానులు నిర్వహించిన బైక్‌ర్యాలీలో గాజువాకలోని పలు వీధులు ఎరుపెక్కాయి. బైక్‌ర్యాలీలో ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, లోకేష్‌, కిరీటం, పల్లెలు నర్సింగరావు పాల్గొన్నారు.యాదవ జగ్గరాజుపేటలో.. విశాఖపట్నం : ఇండియా వేదిక బలపర్చిన సిపిఎం గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడును గెలిపించాలని కోరుతూ శనివారం యాదవ జగ్గరాజుపేటలో ప్రచారం నిర్వహించారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో ప్రజాశక్తి జనరల్‌ మేనేజర్‌ ఎం.వెంకటేష్‌, సిబ్బంది టి.అప్పలరాజు, జె.ధనుంజరు, ఆర్‌కె.నాయుడు, పి.ప్రదీప్‌, బి.పాపారావు, ఎస్‌.సత్యమూర్తి, శివప్రసాద్‌, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

➡️