సిఎస్‌ పురంలో అక్రమ కట్టడాల కూల్చివేత

ప్రజాశక్తి-సిఎస్‌ పురం: సిఎస్‌ పురం పంచాయతీ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌ 147/1లో కొందరు హైకోర్టు ఆదేశాలను పాటించకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. గత రెండు రోజుల క్రితం స్థానిక రెవెన్యూ అధికారులుపై సర్వే నెంబర్‌లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించు కోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పంచాయతీలో దండోరా వేయించారు. అయితే ఆక్రమణదారులు తమ ఇష్టానుసారంగా కట్టడాలు నిర్మిస్తుండటం వల్ల శనివారం రెవెన్యూ అధికారులు మూడు జెసిబిలతో అక్రమ కట్టడాలను కూల్చడం ప్రారంభించారు. అయితే అక్కడే నివాసం ఉంటున్న కొందరు ఎస్టి కాలనీవాసులు తమ ఇల్లు కూలిస్తే తాము ఎక్కడ నివాసం ఉండాలని, తమకు ఎక్కడైనా నివాసం ఉండేందుకు ఇళ్ల స్థలాలు చూపించాలని అడ్డుపడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా గుడిసెలు నిర్మించుకొని నివాసముంటు న్నామని, కూలి పనులు చేసుకుంటూ జీవనాన్ని గడుపుతున్నామని, ఒక్కసారిగా మా గుడిసెలను కూల్చివేస్తే మా పరిస్థితి ఏంటని ఎస్టీ కాలనీ మహిళలు జెసిబికి అడ్డుగా నిలబడ్డారు. దీనితో పనులను నిలుపుదల చేశారు. విషయం రెవెన్యూ అధికారులకు చేరవేయడంతో తహశీల్దార్‌ షేక్‌ నాగుల్‌ మీరా సంఘటన ప్రదేశానికి చేరుకొని అచ్చటి పేదలతో మాట్లాడారు. తమ ఇల్లు కూలిస్తే తాము చావడానికైనా సిద్ధమని, తాము ఎక్కడ బతకాలని తహశీల్దారు ముందు వారు వాపోయారు. ఈ సందర్భంగా తహశీల్దారు మాట్లాడుతూ ఈ సర్వే నెంబర్‌ పరిధిలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయని, ఎవరూ కూడా అక్రమ కట్టడాలు నిర్మించకూడదని తెలిపారు. తాము చట్ట ప్రకారం పోతున్నామని వారికి సమాధానం ఇచ్చారు. అర్హత కలిగిన వారు ఇళ్ల స్థలాల కోసం తగు ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులను పరిశీలించి తగు న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. ఎవరైనా అక్రమ కట్టడాలు నిర్మించడం గాని, ఆక్రమించుకోవడం గాని చేస్తే అట్టివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ కట్టడాల కూల్చివేతలో భాగంగా లాకా బాలరాజు అనే వ్యక్తి ఇంటిని కూల్చివేస్తుండగా బాలరాజు పురుగుల మందు డబ్బా పట్టుకొని తన ఇంటిని కూలిస్తే తాను ఇక్కడే పురుగుల మందు తాగి చనిపోతానని బెదిరించడంతో అధికారులు జోక్యం చేసుకొని సర్దిచెప్పారు.

➡️