గుర్తులు సమస్య తెచ్చిపెట్టేనా?

Apr 26,2024 21:30

ప్రజాశక్తి -భామిని : పాలకొండ నియోజకవర్గంలో జాతీయ జనసేన పార్టీ గుర్తు బకెట్‌, జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్‌ కావడం ఓటర్లలో చర్చనీయాంశమైంది. పాలకొండ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ నామినేషన్‌ వేసి ప్రధాన పోటీదారునిగా ఉన్నారు. ఇదే సమయంలో జాతీయ జనసేన పార్టీ తరుపున పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిమ్మక కృష్ణ నామినేషన్‌ వేశారు. పార్టీ పేర్లు ఒకేలా ఉండడం, అభ్యర్థులు పేర్లు చిన్న తేడాతో దగ్గరగా ఉండడం, గాజు గ్లాస్‌, బకెట్‌ గుర్తుల మధ్య పెద్ద వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండడం జనసేనకు సమస్యను తెచ్చి పెడుతుందా అన్న అంశం చర్చనీయాంశంగా ఉంది. జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు గెలుపు అవకాశాలు ఎక్కువ వున్న ఈ సందర్బంలో ఈ సమస్య ఏంటా అని టిడిపి, జనసేన వర్గాలు చర్చిస్తున్నాయి. జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి నిమ్మక కృష్ణ పాలకొండ ఎంఎల్‌ఎ అభ్యర్థి గా ఉపసంహరించుకుంటారో లేదో చూడాలి.

➡️