సాగు బాటలో రైతన్న

Jun 29,2024 23:27
సాగు బాటలో రైతన్న

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిజిల్లావ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఏరువాక పౌర్ణమి వచ్చింది వెళ్లింది, మగశిర కార్తెలో సగం గడిచిపోయింది, జూన్‌ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు పలకరించాయి. రోహిణి కార్తె అనంతరం విత్తనం నాటితే ఈ సమయంలో మొక్క మొలుస్తుందని, ఆ మొక్కలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి చీడ పీడలను తట్టుకోవడంతో పాటు పంట దిగుబడులు కూడా గణనీయంగా వస్తాయని రైతులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో రోహిణి కార్తె ప్రారంభం కాగానే జిల్లాలో చాలా ప్రాంతాల్లో రైతుల పొడి దుక్కుల్లోనే అక్కడక్కడా వాణిజ్య పంటలు విత్తనాలు వేశారు. మరోవైపు వరి సాగు చేసే రైతన్నలు నార్లు పోసుకుని సిద్ధంగా ఉన్నారు. గోదావరి ఆయకట్టులో కాలువలకు విడుదల చేసిన నీరు మెట్ట ప్రాంతాలలో రైతులకు వర్షాలు ఊరటనిచ్చాయి. జిల్లావ్యాప్తంగా అత్యధిక మండలాల్లో కురిసిన వర్షం రైతన్నలతోపాటు పట్టణ ప్రజానీకానికి ఊరటనిచ్చింది.1.94 లక్షల ఎకరాల్లో వరి సాగుజిల్లావ్యాప్తంగా అధికారుల గణాంకాల ప్రకారం ఖరీఫ్‌ సాగు 1.94 లక్షల ఎకరాల్లో సాగయ్యే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకు 17,342 ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. పంటలు చేతొకొచ్చే దశలో ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలంటే వానాకాలం పంట సాగును నెల రోజుల ముందుకు తీసుకొచ్చి.. జూన్‌ మొదటి వారంలోని వరి నాట్లు వేసుకోవాలని గత మూడేళ్లు అధికార యంత్రాంగం సూచిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో జూన్‌1న కాల్వలకు నీరు విడుదల చేస్తున్నారు. అక్టోబర్‌ నెలాఖరుకు వరి కోతలు వచ్చి అకాల వర్షాలు, గోదావరి వరదల నుంచి కాపాడుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికూడా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు జూన్‌ ఒకటో తేదీ నుంచి సాగునీరు విడుదల చేశారు. ప్రతిరోజూ మూడు డెల్టాలకు సుమారు 8000 క్యూసెక్కుల సాగునీటి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్‌బికెలు, సహకార సంఘాల ద్వారా భూసారానికి అవసరమైన జీలుగులు, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేశారు. విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించడతో రైతులు ముందస్తు సాగుకు సన్నద్దమయ్యారు. వ్యవసాయ శాఖ సంసిద్ధంరాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ సంసిద్ధమయ్యింది. ముందస్తు సాగుకు రైతులకు అవసరాలు తగ్గట్టు 28 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులను అందుబాటులోకి తెచ్చారు. ఆర్‌బికెలలో 2100 టన్నులు, ప్రైవేట్‌ దుకాణాలు సొసైటీల్లో 20 వేల టన్నులు అందుబాటులో ఉంచారు.కౌలు కార్డుల రెన్యువల్స్‌ ప్రక్రియ చేపట్టారు. ఐదేళ్లుగా బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తరచూ అల్పపీడన ద్రోణులు ఏర్పడి భారీ వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ఎగు రాష్ట్రాల్లో వర్షాలు తోడవుతున్నాయి. వెరసి గోదావరి వరదల రూపంలో జిల్లా రైతాంగాన్ని నష్టాలపాలు చేస్తున్నాయి. వేసవి కాలంలో కాలువల ఆధునీకరణ పూడికతీత వంటి పనులలో ప్రభుత్వ చిత్తశుద్ధి లేమి ప్రధాన కారణంగా మారుతోంది. పంట పొలాల్లో కురిసిన వర్షాలు రైలు ద్వారా దిగువకు వెళ్లే పరిస్థితులు లేవు. దీంతో పొలాల్లో నీళ్లు నిలబడి అకాల వర్షాలకు తుపాన్లకు రైతన్నలు నష్టపోతున్నారు.ఈ ఏడాది సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

➡️