జిల్లాలో పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం

Jun 29,2024 23:29
జిల్లాలో పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంజిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లూ చేశామని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ జిల్లా కలెక్టర్లతో పెన్షన్‌ పంపిణీ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. స్థానిక జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశమందిరం నుంచి కలెక్టర్‌ ప్రశాంతి, జాయింట్‌ కలెక్టర్‌ తేజ్‌ భరత్‌ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా నిర్వహించాలని సిఎం నీరబ్‌ కుమార్‌ ఆదేశించరాఉ. జులై, 1వ తేదీ ఉదయం 6 గంటలకు పెన్షన్‌ పంపిణీ నమోదు కావాలన్నారు. మొదటి రోజే 90 నుండి 95 శాతం మేరకు పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలన్నారు. కలెక్టర్‌ పి.ప్రశాంతి వివరిస్తూ మాట్లాడుతూ జూలై 1న ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ పంపిణీకి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామన్నారు. ఉదయం 5 గంటల నుండే పెన్షన్‌ ప్రక్రియ ప్రారంభించి, 1వ తేదీనే 100 శాతం మేర పెన్షన్లు పంపిణీ అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డ్‌ సచివాలయ సిబ్బంది సేవలను వినియోగిస్తున్నామని, అదనపు సిబ్బందిగా వివిధ శాఖలలోని జూనియర్‌ అసిస్టెంట్‌, తదితర సిబ్బంది సేవలు వినియోగిస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన సాంకేతిక పరికరాలను సిబ్బందికి అందించామన్నారు. అదనపు సిబ్బందికి బయో మెట్రిక్‌ యంత్ర పరికరం వినియోగంపై శిక్షణ ఇచ్చామన్నారు. అనంతరం కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ జులై ఒకటవ తేదీనే ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ పంపిణీ పక్రియ ఉదయం 5 గంటల నుంచే ప్రారంభించాలని కలెక్టర్‌ ఆదేశించరాఉ. జిల్లాలో 2,44,302 మంది పెన్షన్‌ లబ్ధిదారులకు రూ.165.13 కోట్ల నగదు ఇంటింటి పంపిణీ నిమిత్తం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలో 9,552 క్లస్టర్ల వారీగా 2,44,302 మంది పెన్షన్‌ లబ్దిదారులను గుర్తించామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌డిఎ పీడీ ఎన్‌వివిఎస్‌.మూర్తి, డిఎల్‌డిఒలు పి.వీణా దేవి, బి.శాంతమణి పాల్గొన్నారు.

➡️