ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలి : దీపక్ మిశ్రా

Apr 11,2024 17:35 #2024 elections, #palanadu

ప్రజాశక్తి-పల్నాడు : రానున్న సార్వత్రిక ఎన్నికల విధులలో పోలీస్ సిబ్బంది నిష్పక్షపాతంగా పకడ్బందీగా విధులు నిర్వహించాలని పోలీస్ ప్రత్యేక పరిశీలకులు విశ్రాంత ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట కలెక్టరేట్ లో గురువారం ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి జిల్లాలో ఎన్నికల నిర్వహణపై తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. పోలింగ్ స్టేషన్లో కనీస వసతులు, సి విజిల్ యాప్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్టర్ తదితర అంశాలపై సుదీర్ఘంగా వివరించారు. అనంతరం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ఈ ఎస్ ఎం ఎస్ విధులలో భాగంగా ఇప్పటివరకు రూ 1.40 కోట్లను సీజ్ చేసినట్లు వివరించారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులు ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్పోస్టులు మరియు జిల్లా సరిహద్దుల వద్ద తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం స్పెషల్ పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విధులు బాధ్యతగా వ్యవహరించాలని రానున్న తరానికి మంచి సమాజాన్ని అందించేలా ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికల విధులలో ఒక వర్గానికి గాని ఒక రాజకీయ పార్టీకి గాని అనుకూలంగా వ్యవహరించ కూడదని, ఎన్నికల విధులలో అలసత్వం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ సంకబ్రత భాగ్జీ, గుంటూరు రేంజి ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి, జాయింట్ కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి కె.వినాయకం పోలీస్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️