ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్‌: సోమవారం జరగనున్న ఎన్నికల పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఎఎస్‌ దినేష్‌కుమార్‌ సిబ్బందిని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గిద్దలూరు సెయింట్‌ పాల్స్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ నిర్వహణ కేంద్రాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. ఈవిఎంలు, పోలింగ్‌ సామగ్రి డిస్ట్రిబ్యూషన్‌, సిబ్బంది తదితర అంశాలపై ఆరా తీశారు. ఎన్నికల కమిషన్‌ చెక్‌లిస్టు ప్రకారం పోలింగ్‌ మెటీరియల్‌ పంపిణీ చేయాలని గిద్దలూరు నియోజకవర్గ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ డి నాగజ్యోతికి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలింగ్‌ సిబ్బందికి కలెక్టర్‌ ప్రత్యేకంగా సూచించారు. విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఆయా పోలింగ్‌ కేంద్రాలలో అన్ని వసతులూ కల్పించామని అన్నారు. పోలింగ్‌ సిబ్బందికి ఎలాంటి అవసరం వచ్చినా తీర్చేందుకు బిఎల్‌ఓలు, సెక్టార్‌ ఆఫీసర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోలింగ్‌ విధులకు గైర్హాజరు అయిన సిబ్బందిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ తెలిపారు.

➡️