ఒకటిన ఇళ్ల వద్దనే సామాజిక పింఛన్లు ఇవ్వాలి : జీవీ

Apr 28,2024 21:29

నిరసన ప్రదర్శనలో జీవీ ఆంజనేయులు, టిడిపి శ్రేణులు
ప్రజాశక్తి – వినుకొండ :
సామాజిక పింఛన్లను ఒకటో తేదీన ఇళ్ల వద్దే పంపిణీ చేయాలని ఎన్‌డిఎ కూటమి తరుపున వినుకొండ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తెలుగుదేశం, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొనిజేటి నాగశ్రీను రాయల్‌, బిజెపి నాయకులతో కలిసి స్థానిక 14వ వార్డులో ఆదివారం నిరసన ప్రదర్శన చేశారు. జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ జగన్‌ అస్తవ్యవస్త ఆర్థిక విధానాలతో రాష్ట్రాన్ని రూ.14 లక్షల కోట్ల అప్పులకుప్ప చేసి, అందినకాడికి దోచుకున్నారని, ఇప్పుడు పింఛన్ల పంపిణీకీ నిధుల్లేక నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. పింఛన్లను వాలంటీర్లు ఇవ్వకూడదని ఎన్నికల సంఘం చెప్పిందే గానీ ప్రభుత్వ అధికారులు ఇవ్వకూడదని చెప్పలేదని అన్నారు. పింఛన్లు ఇంటికి ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఓట్లు పడతాయని వైసిపి భావిస్తోందని, ఇళ్ల వద్ద ఇవ్వకుంటే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఆంజనేయులు దంపతుల ప్రచారం
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది టిడిపి హయాంలోనేనని జీవీ ఆంజనేయులు, లీలావతి దంపతులు అన్నారు. 14వ వార్డులో ఎన్నికల ప్రచారం చేసిన వారు మాట్లాడుతూ 2014-19 కాలంలో రూ.2,600 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే వైసిపి హయాంలో ఒక్క రూపాయి కూడా ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తేలేకపోయారని విమర్శించారు. వరికెపూడిశెల, వాటర్‌గ్రిడ్‌ బొల్లా నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అభివృద్ధిని వదిలేసి భూకబ్జాలు, ఇసుక, మద్యం, రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై పడ్డారని ఏద్దేవ చేశారు. ఈ ప్రాంతానికి మేలు చేయాలనే సంకల్పంతో లావు శ్రీకృష్ణదేవరాయలు వైసిపిని వీడి టిడిపి తరుపు పోటీ చేస్తున్నారని, ఆయన్నూ గెలిపించాలని కోరారు. పొరపాటున అనిల్‌కుమార్‌కు ఓటేస్తే ఈ ప్రాంతాన్ని బెట్టింగ్‌లకు అడ్డాగా మార్చేస్తారని అన్నారు.
రూ.2-3 కోట్లతో బీసీ భవన్‌
తాము అధికారంలోకి రాగానే వినుకొండలో రూ.2-3 కోట్లతో పెద్ద బీసీ భవన్‌ నిర్మిస్తామన్నారు జీవీ ఆంజనేయులు హామీనిచ్చారు. బీసీలకు వైసిపి రద్దు చేసిన 27 సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తామన్నారు. స్థానిక తిమ్మాయపాలెం రోడ్‌లోని వై కన్వెన్షన్‌ హాల్‌లో వడ్డెర్ల ఆత్మీయ సమావేశం జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతిభగల విద్యార్థులకు శివశక్తి ఫౌండేషన్‌ ద్వారా ఏటా 100 మంది బీసీల పిల్లలకు ఉపకార వేతనాలు ఇస్తానన్నారు. మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎంపిపి లేదా యార్డు చైర్మన్‌, లేదా మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌గా వడియరాజులకు ఆంజనేయులు అవకాశం ఇస్తారని చెప్పారని, ఆ బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు.

➡️