తునిలో హోరాహోరీ పోరు..!

Mar 17,2024 22:57
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో

ప్రజాశక్తి – కోటనందూరు

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో తుని నియోజవర్గంలో యనమల, దాడిశెట్టి మధ్య పోరు ఉత్కంఠ భరితంగా మారింది. తుని నియోజకవర్గం నుంచి 26 సంవత్స రాలపాటు ఏకచత్రాధిపత్యంగా అసెంబ్లీకి వెళ్లిన టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, వరుసగా మూడు దఫాలు ఓటమిని మూటగట్టుకున్నారు. 2009 లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాజా అశోక్‌ బాబు చేతిలో యనమల రామకృష్ణుడు ఓడిపో యారు. తను క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని తుని నియోజకవర్గము నుంచి పోటీ చేయనని ప్రకటించారు. 2014 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా తన సోదరుడైన యనమల కృష్ణుడును బరిలో దింపారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన దాడిశెట్టి రాజా ఆయనపై 10 వేల ఆధిక్యంతో విజయాన్ని అందుకున్నారు. 2019 సంవత్సరంలోనూ యనమల కృష్ణుడు తిరిగి టిడిపి అభ్యర్థిగానే పోటీలో నిలిచారు. అప్పుడూ ఓటమి తప్పలేదు. వరుసగా మూడు పర్యాయాలు యనమల కుటుంబం ఓడిపోవడంతో తుని నియోజక వర్గంపై యనమల కుటుం బ సభ్యులు పూర్తిగా పట్టు కోల్పోయారు. యనమల కుటుంబంపై వరుసగా రెండుసార్లు విజయం సాధించిన దాడిశెట్టి రాజాకు సిఎం జగన్మోహన్‌ రెడ్డి మంత్రి పదవిని ఇచ్చి మంచి గుర్తింపును ఇచ్చారు. దీంతో నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి దాడిశెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ప్రజల్లో మంచి పట్టును సాధించారు.2024 సార్వత్రిక ఎన్నికల్లో 3వసారి దాడిశెట్టి రాజా పోటీలో నిలిచి హ్యాట్రిక్‌ సాధించాలని ఉవ్వూళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలోనే దాడిశెట్టిని ఎట్లాగయైన ఓడించాలన్నా లక్ష్యంతో టిడిపి అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. దాడిశెట్టి సామాజికవర్గానికి చెందిన వ్యక్తినే పోటీలో పెట్టాలనే ఆలోచన చేసింది. టిడిపి, జనసేన కూటమి పక్షాన బలమైన అభ్యర్థిని రంగంలోకి దిచ్చేందుకు పలువురు పేర్లను పరిశీలన చేసింది. అయితే టిడిపి అధినేత చంద్రబాబుకు అంతరంగికుడైన యనమలను కాదనే మరో వ్యక్తికి అవకాశం ఇవ్వడం సరికాదనే భావనతో ఆ ప్రయత్నాన్ని పక్కన పెట్టింది. దీంతో యనమల రామకృష్ణుడు పెద్ద కుమార్తె యనమల దివ్యను తన రాజకీయ వారసురాలుగా ఎన్నికల బరిలోకి దింపారు. వరుసగా మూడవసారి యనమల, దాడిశెట్టి మధ్య తుని నియోజకవర్గంలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. యనమల రామకృష్ణుడు కుమార్తె విజయం కోసం శక్తి వంచన లేకుండా నియోజకవర్గంలో ఉన్న టిడిపి నాయకులను, కార్య కర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. యనమల రామకృష్ణుడు నేరుగా కార్యకర్తలు, నాయకుల గృహాలకు వెళ్లి పలకరించి తన కుమార్తె విజయానికి సహకరించాలని కోరుతున్నారు. దీంతో కోటనందూరు, తుని పట్టణం, తుని రూరల్‌, తొండంగి మండలంలో పలు పార్టీలకు చెందిన నాయకులు టిడిపి గూటికి చేరుతున్నారు. దీనికి తోడు మంత్రి దాడిశెట్టి రాజా చిన్ననాటి స్నేహితుడు, 2014, 2019, ఎన్నికల్లో మంత్రి వెనకాల నడిచి పర్సనల్‌ సెక్రటరీగా పని చేసి వరుసగా రెండు పర్యాయాలు రాజా విజయానికి కృషి చేసిన మోతుకూరు వెంకటేష్‌ సైతం టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమికి తోడు మోతుకూరు వెంకటేష్‌ రాకతో యనమల దివ్య విజయానికి ఎంతగానో దోహదం చేస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోరు హోరహోరీగా సాగే అవకాశాలు కన్పిస్తున్నాయి.

➡️