పైపులైన్లు తొలగించకపోతే ఎన్నికలను బాయ్ కాట్ చేస్తాం

Mar 14,2024 12:13 #fishermen, #Kakinada, #Protest

కోనపపేటలో రోడ్డుపై మత్స్యకారులు బైఠాయింపు
ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : అరబిందో ఫార్మా పరిశ్రమలో సముద్రంలో వేసిన పైపులైన్లు తొలగించకపోతే రానున్న ఎన్నికలను బాయ్ కాట్ చేస్తామని మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించి గురువారం నినాదాలు చేశారు. వీరికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల, మత్స్యకార కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లాటి శ్రీనివాసరావు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరబిందో ఫార్మా పరిశ్రమలో సముద్రం లో వేసిన పైప్ లైన్లు తొలగించకపోతే ఉద్యమాన్ని ఆపేది లేదని తెలిపారు. పైప్లైన్ ద్వారా వ్యర్ధాలను సముద్రంలోకి వదలడంతో మత్స్యకారుల జీవన ఉపాధికి ఆటంకం కలిగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. పైపులైన్ వల్ల వలలు చిరిగిపోవడం, బోట్లు ధ్వంసం అవ్వడం, మత్స్య సంపద నశించి పోవడం జరిగే ప్రమాదం ఉందని తెలియజేశారు. వారం రోజుల నుంచి మత్స్యకారులు పోరాటం సాగిస్తున్న సంబంధిత ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించే విధంగా చొరవ తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సమస్య పరిష్కరించే వరకు ఉద్యమం ఆగేది లేదని భీష్మించి కూర్చున్నారు.

➡️