వైసిపికి ఓట్లడిగే అర్హత లేదు : ‘మలిశెట్టి’

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ వైసిపి నాయకులకు ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదని జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జి మలిశెట్టి వెంకటరమణ అన్నారు. శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసిపి పాలనలో ప్రజలు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కోల్పోయారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం, హత్యలకు పాల్పడడం వైసిపి నైజంగా మారిందన్నారు. ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడమే పనిగా పెట్టుకున్న వైసిపి జనంలోకి వెళ్లి ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. వైసిపి నాయకులు జిల్లా కేంద్రంతో పాటు వైద్య కళాశాలను ఇతర ప్రాంతాలకు తరలించి రాజంపేటకు అన్యాయం చేశారని, గతంలో ఆగుతున్న రైళ్లు సైతం నాయకుల పాలనలో రాజంపేటలో స్టాపింగ్‌ లేకుండా పోయాయని విమర్శించారు. రాజంపేటలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మదనపల్లె, రాయచోటి ప్రాంతాలకు అన్యాయం జరగకుండా రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారని, టిడిపి అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం తనను గెలిపిస్తే అసెంబ్లీలో రాజంపేట వాసుల గళం వినిపించి జిల్లా కేంద్రం సాధిస్తానని పలుమార్లు చెప్పారని పేర్కొన్నారు. రాజంపేట జిల్లా కేంద్రం కావాలన్నా, అభివద్ధి బాటలో నడవాలన్నా ఓటు అనే ఆయుధంతో వైసిపి గూండాలను ఎదిరించి కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

➡️