కుతలేరు వంతెనను, డ్రైనేజ్‌ కాలువను ప్రారంభించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రంలో కుతలేరు వంతెన, డ్రైనేజ్‌ కాలువను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి శనివారం ప్రారంభించారు. శుక్రవారం రాత్రి నుండి హైడ్రామా మధ్య ప్రశాంతంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ శిలాఫలకం ఏర్పాటుపై స్థానిక నాయకుల పేర్లు లేవని ప్రోటోకాల్‌ పూర్తిస్థాయిలో పాటించలేదని ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి రెండు కోట్ల రూపాయల నిధుల తో నిర్మించిన కూతలేరు వంతెనను రూ.40 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన డ్రైనేజీ కాలువలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ … దశాబ్దాల కాలం నుండి కుతలేరు వంక పై నూతన వంతెన నిర్మాణం సమస్యాత్మకంగా మారి ప్రతిసారి శంకుస్థాపనలు చేయడం స్థానిక సమస్యలతో వంతెన నిర్మాణం ఆగిపోవడం జరిగేదని తాను గెలిస్తే సమస్యలన్నీ అధికమించి కూతలేరు వంతెన నిర్మించి తీరుతానని ఇచ్చిన మాట ప్రకారం స్థానికంగా ఉన్న సమస్యలతోపాటు వంతెన నిర్మాణానికి ఉన్న ఆర్థిక సమస్యలను సైతం ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం నేడు కుతలేరు వంతెన నిర్మించి ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఉయ్యాలకుంట క్రాస్‌ నుండి కుతలేరు వంతెన వరకు డ్రైనేజీ కాలువ నిర్మాణం కూడా ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉందని ఆ సమస్య ను కూడా అధిగమించి నూతన డ్రైనేజ్‌ ని నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఎం ఎస్‌ రాష్ట్ర డైరెక్టర్‌ రఘునాథరెడ్డి, ఎంపీపీ నాగేశ్వరరావు సింగల్‌ విండో చైర్మన్‌ లోకనాథ్‌ రెడ్డి. వైసీపీ నాయకులు ఎర్రి స్వామి రెడ్డి, మొరుసు రమణ రెడ్డి, మొరుసు సంజీవరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు శంకర్‌ యాదవ్‌, కాటమయ్య, రాజారెడ్డి మార్కెట్‌ యార్డ్‌ మాజీ డైరెక్టర్‌ కేశవరెడ్డి, మండల కోఆప్షన్‌ సభ్యురాలు సాబీర ఆర్‌ అండ్‌ బి అధికారులు, బాలకాటమయ్య, ప్రసాదరెడ్డి, కావ్య ఆర్డబ్ల్యూఎస్‌ ఇంజనీర్‌ రవీంద్రనాథ్‌ రెడ్డి వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ సికిందర్‌, తదితరులు పాల్గన్నారు. ప్రారంభోత్సవ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సింగనమల సీఐ శ్రీధర్‌ నార్పల ఎస్సై రాజశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కుతలేరు వంతెన పరిసరాల్లో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవానికి పలువురు అధికారులు గైర్హాజరయ్యారు. కూతలేరు వంతెన ప్రారంభోత్సవానికి మండలంలోని పలువురు ప్రధాన అధికారులు సైతం గైర్హాజరయ్యారు. దీనిపై విచారించగా నార్పల లకు ఎమ్మెల్యే పద్మావతి వస్తున్నట్లు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్నట్లు ఆర్‌ అండ్‌ బి అధికారుల నుండి తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. తొలగించిన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని…. నార్పల పాత బస్టాండ్‌ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూతలేరు వంతెన అభివృద్ధి పనుల భాగంలో తొలగించారని, తొలగించిన విగ్రహాన్ని తిరిగి బస్టాండ్‌ ఆవరణలో ఏర్పాటు చేయాలని సిపిఐ నాయకులు గంగాధర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్నలగడ్డ పద్మావతికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సుధాకర్‌, శివ, రమేష్‌, శంకర్‌, శీను, తదితరులు పాల్గొన్నారు.

➡️