గుంటూరు బాపనయ్య ఆశయ సాధనకు కృషి : వ్యకాసం

Mar 25,2024 16:37

గుంటూరు బాపనయ్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

గుంటూరు బాపనయ్య ఆశయ సాధనకు కృషి : వ్యకాసం
ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్‌
భూమి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జమీందారీ వ్యవస్థపై విరోచిత పోరాటాలు చేసిన గుంటూరు బాపనయ్య ఆశయాల సాధనకు కృషి చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.నాగేశ్వరరావు అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుంటూరు బాపనయ్య 46వ వర్ధంతి సందర్భంగా సోమవారం స్థానిక భరత్‌ కాంప్లెక్స్‌లో వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వ్యకాసం జిల్లా సహాయ కార్యదర్శి పి.పకీరుసాహెబ్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎం.నాగేశ్వరావు మాట్లాడుతూ గుంటూరు బాపనయ్య అట్టడుగు కులాల్లో పుట్టి కమ్యూనిస్టు పార్టీ ద్వారా చైతన్యమై పేదలు, బడుగులు, బలహీన వర్గాల కోసం ఉద్యమాలు నిర్మించి నాటి చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా విరోచిత పోరాటాలు చేశారని తెలిపారు. దళితులకు, బడుగులకు భూమి పంచిన చరిత్ర గుంటూరు బాపనయ్య గారిదని, జీవిత చరమాంకం వరకు పేద ప్రజల శ్రేయస్సు కోసం పరితపించి ఉద్యమాల్లోనే అశువులు బాశారని, గుంటూరు బాపనయ్య జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. ముఖ్యంగా వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలకు ఆయన సేవలు చిరస్మరణీయ మని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో భూమి, ఇల్లు, ఇళ్ల స్థలాల కోసం పోరాటాలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో వ్యకాస జిల్లా నాయకులు టి.ఓబులేసు, ఎం.కర్ణ, సిఐటియు జిల్లా నాయకులు టి.గోపాలకృష్ణ, సి.నాగన్న, ఏసేపు, నాగభూషణం, నాగేశ్వరమ్మ, ఖాజాబీ, బేగం తదితరులు పాల్గొన్నారు.

➡️